Showing posts with label సాహిత్యం. Show all posts
Showing posts with label సాహిత్యం. Show all posts

32వ టెక్సాస్ తెలుగు సాహిత్య సదస్సు - సమీక్ష

హ్యూస్టన్ నగరం, టెక్సాస్ - మార్చి 15, 2014

టెక్సాస్‌లో ఆరునెల్లకొకసారి జరుపుకునే తెలుగు పండుగకు ఆతిధ్యం వహించే అదృష్టం ఈసారి హ్యూస్టన్ వాసులకు లభించింది. 32వ టెక్సాస్ సాహీతీ సదస్సు మార్చి 15వ తారీఖున స్థానిక షుగర్ లాండు లోని అంజలి సెంటర్లో  అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, అందులోనూ ఈ విశిష్ట  సాంప్రదాయానికి అంకురార్పణ చేసిన పెద్దల సమక్షంలో జరుపుకోవడం విశేషం. సభలో వంగూరి చిట్టెన్ రాజు, సత్యం మందపాటి, శాయి రాచకొండ, వై.వి.రావు, గిరిజా శంకర్, మాధవరావు గోవిందరాజు, తుర్లపాటి ప్రసాద్ వంటి సాహితీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమమే హ్యూస్టన్ నగరంలో 46వ "నెల నెలా తెలుగు వెన్నెల" కూడా అవడం హ్యూస్టన్ నగరవాసులకు ద్విగుణీకృతమైన ఆనందాన్ని, గర్వాన్ని కలిగించింది.
సదస్సును ఆరంభించే ముందు పలువురు అన్నపూర్ణలు ఎంతో రుచికరంగా వండి వడ్డించిన అద్భుతమైన భోజనాలు ఆ రోజు జరగబోయే సాహిత్యపు విందుకు నాంది పలికాయి. దాదాపు వందమందికి "పాట్ లక్" అనబడే ప్రక్రియ ద్వారా ఈ విందుకు ఏర్పాట్లు నిర్వహించిన లలిత రాచకొండగారికీ, అడగ్గానే ఉత్సాహంగా ముందుకొచ్చి తమ పాకశాస్త్ర ప్రావీణ్యతనంతటినీ రంగరించి భక్ష్య, భోజ్యాదులను పంపిన ఆ తల్లులకూ ధన్యవాదాలు. అన్నదాతలూ, సుఖీభవ!

రోజంతా సాగిన ఈ సభకి టెంపుల్, ఆస్టిన్, శాన్ అంటానియో, హ్యూస్టన్ నగరాలనుండి అమెరికా తెలుగు సాహిత్య ప్రముఖులు, యువ రచయితలు, సాహీతీ ఆత్మీయులు (టెక్సాత్మీయులు) పెద్ద సంఖ్యలో విచ్చేశారు. హ్యూస్టన్ సాహీతీ లోకం అధ్వర్యంలో జరిగిన ఈ సభలో సాహితీ విశ్లేషణ, స్వీయ రచనలు, చిక్కుముడి, చిన్నారుల ప్రసంగాల వంటి ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి.

సమన్వయకర్త చిలుకూరి సత్యదేవ్ అతిధులని సాదరంగా ఆహ్వానించగా, చిన్నారి లాస్య ధూళిపాళ రాయప్రోలు సుబ్బారావుగారి దేశభక్తి గీతం ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా’ చక్కగా ఆలపించడంతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. తర్వాత స్పందన అక్కరాజు మాట్లాడుతూ తెలుగుని అభిమానించడానికి ‘దేశ బాషలందు తెలుగు లెస్స, ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్’ లాంటి  ఉపోద్ఘాతాల అవసరం లేదు, మన మాతృబాషని మనం ప్రేమిస్తామని చెప్పిన స్పష్టమైన తీరు సభికులను ఆకట్టుకుంది.  
మొదటి విడత సాహిత్య పరిశీలనా విభాగం సత్యం మందపాటి అద్యక్షతన జరిగింది. దీనిలో మొదట పండిత పామర కోణంలో చాటు చాటుపద్యాలపై ప్రసాదరావు వెన్నెలకంటి ప్రసంగిస్తూ తెనాలి రామకృష్ణుడు, శ్రీనాథుడు వంటి కవుల చాటుపద్యాలతో పాటు పామరజనుల నుండి వెలువడిన చాటువులను కూడా ఉటంకించి ప్రేక్షకులను అలరించారు. భారతదేశం నుండి విచ్చేసిన జీడిగుంట విజయసారధి తమ తండ్రి జీడిగుంట రామచంద్రమూర్తిగారి రచనలపై కొంత విశ్లేషించి, ఆయన వ్రాసిన "గుడిలో పువ్వు" కథను చదివి ఆహూతుల హృదయాలలో ఆర్ద్రతను నింపారు. చక్కటి గళంతో, శాస్త్రీయంగా కొన్ని కృతులను పాడుతూ కర్ణాటక సంగీతంలోని కీర్తనలలో వుండే తత్వబోధను సీతారాం అయ్యగారి విశదీకరించారు. చివరగా భారతదేశం నుండి ఈ దేశానికి చుట్టపుచూపుగా వచ్చిన ప్రఖ్యాత రచయిత్రి, కవయిత్రి రేణుక అయోల తమ కథనొకటి చదివి, తమ పూర్వీకులు, భగవాన్ రమణమహర్షికి ఆంతరంగికులు అయిన కావ్యకంట గణపతి ముని గురించి ప్రస్తావించారు.

చలన చిత్రాలు తెలుగు వారికి బాగా దగ్గరైన వినోదం కావడంతో మాధవరావు గోవిందరాజు గారు చిత్ర గీతాలపై అడిగిన ప్రశ్నలకి సభికులు ఉరకలేసిన ఉత్సాహంతో సమాధానాలు చెబుతూ పాల్గొన్నారు.

మొదటి విడత స్వీయ రచనల విభాగం వై.వి.రావు అద్యక్షతన జరిగింది.
తెలుగు బాష, ప్రాంతీయ భావాలలో ఎన్నో అపోహలు చలామణిలో ఉన్నాయని, వీటిని తొలిగించేందుకు చారిత్రక నేపధ్యం తెలుసుకోవల్సిన అవసరముందని హరి మద్దూరి తెలియజేసి, వారి పరిశోధనని స్లైడ్ల ద్వారా చూపారు. తరువాత అక్కినేనితో వారికున్న ఏళ్ళ అనుబంధాన్ని కుటుంబరావు ప్రస్తావించగా, అమెరికాలో పుట్టి, పెరిగిన చంద్రలేఖ మాతృ బాషపై తన మనోభావాలను పంచుకుని ‘బంగారు పాప’ పాటతో ముగించారు.  రాయుడు వృద్ధుల నిజజీవితంలో జరిగిన ఒక సంఘటనను చక్కటి కథ రూపంలో చదివి వినిపించగా, కోసూరి ఉమా భారతి తమ రచనా వ్యాసంగానికి నేపథ్యాన్ని, తమ చిన్నప్పటి అనుభవాలనూ ఎంతో ఆసక్తికరంగా చెప్పారు.

సాహిత్యానికి, సంగీతానికి, తెలుగుదనానికి పెద్ద పీట వేసిన సినీ దర్శకుడు కళాతపస్వి విశ్వనాధ్ సినీగమనాన్ని, జ్ఞాపకాలని ‘విశ్వనాదామృతం’ అనే ప్రాజెక్ట్ ద్వారా పదిలపరిచే ప్రయత్నం చేస్తున్న రాం చెరువు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ కార్యక్రమపు అంశాల కూర్పుని విరామ సమయంలో సభికులకి ప్రదర్శించారు. పకోడీలు తింటూ ఆ  ప్రివ్యూను వీక్షించి వారి ప్రయత్నాన్ని ఎంతగానో మెచ్చుకున్నారందరూ.

విరామం తరువాత పుస్తక పరిచయం కార్యక్రమాన్ని వంగూరి చిట్టెన్ రాజు నిర్వహిస్తూ, సామాన్యంగా ఎంతో హంగు, హడావిడీలతో జరిగే ఈ పుస్తకావిష్కరణ ఏ మాత్రం ఆర్భాటాలు లేకుండా జరుపుకుంటున్న రచయిత్రి వెన్నెలకంటి మాణిక్యాంబను ప్రశంసించారు. ఆమె కొన్నేళ్ళుగా వ్రాసుకున్న పాటలను "భావాలాపన" అన్న పేరుతో చక్కటి గ్రంథరూపంలో ప్రచురించారు. అందులోని కొన్ని గేయాలను అద్భుతంగా ఆలపించారామె. ఆ పుస్తకం అమ్మకానికి కాదని, ఎవరైనా ఆసక్తి గలవారు తీసుకోవచ్చునని, ఆ పాటలను ఇతరులు పాడుకోవడమే తమకు తగిన పారితోషికమనీ చెప్పకనే చెప్పారామె.

రెండవ సాహిత్య పరిశీలనా విభాగం శాయి రాచకొండ నిర్వహించారు.
ప్రథమంగా కరుణశ్రీ సాహిత్యంలోని సరళత్వాన్ని, సాహిత్య విలువలనూ సత్యం మందపాటి సోదాహరణంగా వివరించారు. పిదప పోతన భాగవతంలోని కొన్ని ఆణిముత్యాలను తుర్లపాటి ప్రసాద్ ఎంతో చక్కగా ఉటంకిస్తూ అందులోని భక్తితత్వాన్ని ప్రేక్షకులకు అనుభవింపజేసారు.
యెమెన్ నుండి రికార్డు చేసి పంపిన బాలాంత్రపు దంపతుల హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు విన్నప్పుడు ప్రాంగణం సభికుల కరతాళ ధ్వనులతో నిండిపోయింది. నాటకీయ ఫక్కీలో రాగయుక్తంగా బాలాంత్రపు శారద పాడిన పద్యాన్ని అందరూ ఎంతో మెచ్చుకుని, అప్పుడే అయిపోయిందా అనుకున్నారు.
తరువాత సుమ నూతలపాటి తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా పేరుగాంచిన వారి తాతగారు ఉన్నవ లక్ష్మీ నారాయణ గారితో తమ అనుబంధాన్ని పంచుకున్నారు.
"నాకు నా దేశం, నేను నా దేశానికి" అన్న శీర్షికతో, మన దేశానికి మనమేమిచ్చామన్న విషయంపై తమ భావాలను ప్రేక్షకులతో పంచుకుంటూ, యాభయ్యేళ్ళ క్రితం అమెరికా అధ్యక్షులు జే.ఎఫ్.కే. అన్న "నీ దేశం నీకేమిచ్చిందని అడగకు, నువ్వు నీ దేశానికేమిచ్చావని అడుగు" వాక్యాన్ని గుర్తుకు తెచ్చారు పవన్ అన్నలూర్. 

కార్యక్రమంలో చివరగా స్వీయ రచనల విభాగం తుర్లపాటి ప్రసాద్ గారి అద్యక్షతన జరిగింది.
దీన్ని ప్రారంభిస్తూ టెక్సాస్ రాష్ట్రపు "గిరీశం"గా పరిగణింపబడే గిరిజా శంకర్ తమ “రుక్కుల”లోంచి ఒక కథను వినిపించి నవ్వులతో ముంచెత్తారు.
తమ ప్రసంగాన్ని రెండు-మూడు ఛలోక్తులతో ఆరంభించిన ఇర్షాద్ జేంస్ తమ రచన "విదేశీయుడు"లో భవిష్యత్తులో తెలుగునాట ఎటువంటి రాజకీయ పరిస్థితులు చోటు చేసుకుంటాయో ఒక హాస్య కథానిక రూపంలో చదివి ప్రాంగణాన్ని నవ్వులతో నింపడమే కాక ఆలోచింపజేసారు.
యువకవి శరత్ సూరంపూడి ఎంతో సరళమైన భాషతో, చక్కటి మలుపులతో వ్రాసిన భావకవిత్వం సభికులని ఆకట్టుకున్నాయి. తరువాత ఉమ పోచంపల్లి గారు తమ కవితల సంపుటిలోంచి ఒక కవితను, తమ స్వానుభవాలు ఆధారంగా చేసుకొని వ్రాసిన ఒక చిన్న కథను వినిపించారు.
 ముగింపుగా డా. వేంకట రాజు త్వరలో రాబోతున్న జయ నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ “ఉగాది” అనే కవితనూ, భారతదేశంలో జరుగుతున్న రాష్ట్రవిభజనకు సంబంధించి సందర్భోచితంగా “నా తెలంగాణ” అనే కవితనూ రాగయుక్తంగా పాడి వినిపించారు.

హ్యూస్టన్ నగరంలోని తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు మారుతి రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ తరఫున సాహిత్య సంబంధమైన కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ప్రోద్బలం ఉంటుందని వక్కాణించారు.

షడ్రుచుల వంటి అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన కార్యక్రమాన్ని “హ్యూస్టన్ సాహీతీ లోకం” కార్యవర్గం తరఫున మధు పెమ్మరాజు సహాయ, సహకారాలు అందించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతాభివందనం తెలియజేస్తూ సదస్సును ముగించారు.

పుష్పలావికలు

రమణ బాలాంత్రపు
  
మన ప్రాచీన  సాహిత్యంలో ద్వందార్థాల చతురోక్తి ఎప్పటినుండో ఉంది. 
తెలుగు సాహిత్యంలో "పుష్పలావికలు" (అంటే పువ్వులు అమ్మే యువతులు), "ప్రపాపాలికలు" (చలివేంద్రాలు నడిపే పడుచులు), "శాలిగోపికలు" (పంటకావలి  వనితలు) కనిపిస్తారు.  వీళ్ళందరూ ఎంతో చక్కగా సరసులతో  చతురోక్తులు, కవ్వింఫు సంభాషణలూ చేస్తూ  ఉండే వారు (flirting).  కవులు తమ ప్రతిభ కొద్దీ వీటిని తీర్చి దిద్దారు.  కొందరు కవులయితే మరీ శృతిమించిపోయేవారు. 
ఈ వేళ పుష్పలావికల గురించి ముచ్చటించుకుందాం.  
పుష్పలావికా - ప్రపాపాలికా  వర్ణనలు సంస్కృత ప్రాకృతాలలో విరివిగా ఉండేవి.  తెలుగులో వీటికి రాయలవారే శ్రీకారం చుట్టారు.  వీళ్ళను వీటీగణంగానూ కొనుగోలుదారులను విటసమూహంగానూ క్లుప్తీకరించిన ఘనత కూడా ఆయనదే.  అటుపైని కవులందరికీ ఇదే  రాజమార్గమయింది.
పూలు కొనుక్కోడానికి వచ్చిన వారడిగే కొంటె ప్రశ్నలకు పుష్పలావికలు ఇచ్చే చిలిపి సమాధానాలు వినండి.
మాటలగారడీ కోసం రాయలవారి “ఆముక్తమాల్యద” నుండి ఈ పద్యం చిత్తగించండి.    
వెలఁది!  యీ నీ దండ వెల యెంత?  నా దండ
     కును వెలఁబెట్ట నెవ్వని తరంబు?
కలువ తావులు గాన మలికదంబకవేణి!
     కలువతావులు వాడకయ కలుగునె?
కడివోదు నాకిమ్ము పడఁతి!  యీ గేదంగి
     నన కడివోమి ముందఱికిఁ చూడు  
జాతులే వంబుజేక్షణ! పద్మినులు సైత
     మును నున్నయెడ జాతులునికి యరుదె?
యనుచుఁ దొలినుడి నభిలాష  లెనయ మూఁగి
పలుకుతోడనె నర్మగర్భంబుగాఁగ
నుత్తరము పల్లవశ్రేణికొసఁగు చలరు
లమ్ముదురు పుష్పలావిక లప్పురమున
పూలను విక్రయించే యువతులు (పుష్పలావికలు) కొనడానికి వచ్చిన విటులు (పల్లవులు) వారి నర్మగర్భ సంభాషణ - ఇందులో చూపించారు రాయలవారు.
విటుడు అడుగుతున్నాడు: ఓ యువతీ! (వెలఁది), ఇదిగో నీ దండ వెల ఎంత? ఇక్కడ ఈ అల్లరిపిల్లాడి ఉద్దేశం - పూల దండమాత్రమే కాదు.  నీ బాహువు లేదా నీ సాన్నిధ్యం - దాని ఖరీదు ఎంత అని అడుగుతున్నాడు.  దీన్ని గ్రహించింది ఆ పుష్పలావిక.  గడుసుగా ఎదురు ప్రశ్న వేసింది.  నా దండ వెల చెప్పడం, వెల కట్టడం ఎవడితరం నాయనా?  అంది. రెండు విధాలా సమాధానం అందింది కుర్రవాడికి.
తుమ్మెదల గుంపులాంటి జడదానా! (అళి-కదంబ-వేణి) సరే ఇంతకీ కలువ(ల) తావులు - పరిమళాలు (తావి+లు) కనిపించడంలేదు నీ అంగడిలో? అన్ని రకాల పూవులూ ఉన్నాయిగానీ, కలువపువ్వులు కనిపించవేమిటన్నది పైకి ప్రశ్న. నాయికల నాభిని కలువపువ్వుతోను నీటి సుడితోనూ పోల్చడం కవుల పద్ధతి.  నాభిప్రదేశాలు (తావు=చోటు, తావులు)కనిపించవేమిటి - అన్నది అయ్యగారి ఆంతర్యం.  ఆ అమ్మాయి ఇంతకన్నా గడుగ్గాయి కదా!  అంటోంది - ఎక్కడైనా కలువపువ్వులకి పరిమళాలు వాడిపోకుండానే గుప్పుమంటాయా? - అని రెట్టించింది.  కలువలూ, పొన్నలూ, మొగలిపువ్వులూ - ఇలా కొన్ని నలిగినకొద్దీ, వడిలినకొద్దీ పరిమళాలు విరజిమ్ముతుంటాయి.  ఇవి తాజా కలువలు.  అప్పుడే - వాడకముందే - తావులు విరజిమ్ముతాయా? అన్నది పైకి కనిపించే సమాధానం.  నాభి వగైరా ప్రదేశాలు వాడకముందే (వాడుట=ఉపయోగించుట) కనిపించేస్తాయా - అన్నది లోపల వినిపించే సమాధానం (నర్మం).
ఓ పడతీ! ఇదిగో ఈ మొగలిపువ్వు (గేదంగి  - నన) అసలు నలిగినట్లే లేదు (కడి+పోదు). నాకు ఇయ్యి - అని ఒక తాజా మొగలిపువ్వును చూపిస్తూ అడిగాడు ఆ విటుడు.  కలువపువ్వు నాభికి సంకేతమైనట్టే మొగలి పువ్వు మరొక దానికి సంకేతం.  బదులిస్తోంది ఆ వగలాడి.  అవునవును ఈ పువ్వు (నన) నలగకపోవడం వడిలిపోవడం - అదంతా ముందు ముందు తెలుస్తుందిలే - ముందరికి చూడు - అనేసింది.  కడి అనే మాటకి అన్నపుముద్ద అని మరొక అర్థం.  నా విరహం తట్టుకోలేవు. తిండి సహించకపోవడం ముద్ద దిగకపోవడం (కడి-పోమి) ఇదంతా నీకు ముందు ముందు తెలుస్తుంది.  దృష్టి సారించు - అనడం ఆవిడ ఆంతర్యం.
(తమిళ సినిమా "సర్వర్ సుందరం" లొ విశ్వనాథన్-రామ్మూర్తిల  సంగీత సారధ్యంలో సుశీల-పీ.బీ.శ్రీనివాస్ పాడిన యుగళగీతం మహాకవి కణ్ణదాసన్ గారు వ్రాసిన పాట లో  "పోగ పోగ తెరియుం - ఇంద పూవి వాసం  పురియుం" అన్నారు.  అంటే "పోగా పోగా తెలుస్తుంది - ఈ పూవు వాసన అర్థం అవుతుంది అని అర్థం.  అక్కడ కూడా మనం చర్చించుకుంటున్న అర్థమేనేమో అని నా నుమానం.)  
ఇంక మన పద్యానికి వస్తే, పద్మాల్లాంటి కన్నులున్నదానా! (అంబుజేక్షణా!) నీ అంగడిలో జాజులు (జాతి=జాజి) ఏవీ?  అన్నట్టుగా నువ్వు ఏ జాతిదానవు అని అడిగాడు.  ఆ నెరజాణ ఇలా ఎదురు ప్రశ్న వేస్తోంది: పద్మినులు కూడా ఉన్న అంగడిలో జాజులుండడం (ఉనికి) అరుదా?ఆశ్చర్యమా? అని అడిగింది.  పద్మినీ జాతి స్రీలే ఉన్నచోట (ఉన్నయెడన్) మిగతా జాతులవారు (శంఖిని, హస్తిని, చిత్తిని జాతులు) ఉండరా?అది అంత అరుదా? అన్నది నర్మం.
ఈ విధంగా మొదటి మాటనుంచీ (తొలినుడిన్) కోరికలు (అభిలాషలు) స్పష్టమయ్యే విధంగా కమ్ముకొని (మూఁగి) ప్రశ్నిస్తున్న విటులకు (పల్లవ శ్రేణికిన్) పూలు అమ్ముతున్నారు (అలరులు+అమ్ముదురు) ఆ పుష్పలావికలు.
మూలం;  ఆచార్య  బేతవోలు రామబ్రహ్మంగారి సంపాదకత్వంలో దాసరి లక్ష్మణస్వామి గారి "వర్ణన రత్నాకరము" అనే గ్రంథ సంపుటిలో రెండవ సంపుటి.  పై పద్యానికి వివరణ ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు.
వచ్చేవారం మరొక పుస్పలావికను కలుద్దాం.

సాహిత్యంలో అరసున్నాల పాత్ర - బాలాంత్రపు వేంకట రమణ

ప్రాచీన సాహిత్యంలో పదాలకు అర్థాలు చెప్పడంలో అరసున్నాల పాత్ర ఉంది. ఉదాహరణకి -  
భాగవతం లోని ఉషాకన్య విరహం వర్ణించే పద్యం - "కలికి చేష్టలు భావగర్భంబు లైనను బ్రియుమీఁది కూరిమి బయలు పడఁగఁ..." అన్న పాదంలో "పడఁగ" అరసున్న ఉంటే  బయలు పడగా..అనే అర్థం వస్తుంది.  అదే అరసున్న లేకుండా పడగ అంటే  పడగ (పాము పడగ లో పడగ) అర్థం వస్తుంది.  అర్థం పొసగదు. . 
మరో ఉదాహరణ.  వీఁడు అనే పదం.  అరసున్న ఉంటే ఇతడు అనీ లేకపోతే పట్టణము అని అర్థాలు.  
అరసున్నాలు లేక పోతే మన ప్రాచీన సాహిత్యంలో అర్థాలు మారిపోతాయి . కాబట్టి అరసున్నల అవసరం ప్రచీన సాహిత్యంలో ఉంది