నెల నెలా తెలుగు వెన్నెల - 02/22/2013


నెల నెలా తెలుగు వెన్నెల - 02/22/2013 - శుక్రవారం 

శుక్రవారం, ఫిబ్రవరి 22న "నెల నెలా తెలుగు వెన్నెల" విజయవంతంగా జరిగింది.
"సాహిత్యం సమాజాన్ని మార్చిందా? లేక సాహిత్యం కేవలం సమాజానికి దర్పణమా?" అన్న చర్చాంశంపై సభకు విచ్చేసిన వారందరూ తమ అభిప్రాయాలను వెల్లడి చేసారు. దాదాపు 20 మంది పాల్గొన్న ఈ వెన్నెల కార్యక్రమంలో ఎంతో ఆసక్తికరమైన చర్చ సాగింది.

హ్యూస్టన్‌ వాసులే కాక సాన్ ఆంటోనియో వాస్తవ్యులు దేవగుప్తాపు శేషగిరిరావు, పద్మ దంపతులు కూడా పాల్గొనడం విశేషం. కార్యక్రమాన్ని శేషగిరిరావు తమ అభిప్రాయాలతో ప్రారంభించారు. వాల్మీకి, వ్యాసుడు, పోతన వంటి వారు తమ కావ్యాలతో సమాజంలో దైవభక్తి, ఆధ్యాత్మికత పెరగడానికి  దోహదపడ్డారని ఆయన ఉటంకించారు. ఈ వ్యాఖ్యానాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక సంబంధమైన రచనలు, వేదాలు వంటి వాటిని "సాహిత్యం"గా పరిగణించవచ్చా, లేదా అని కొంత చర్చ జరిగింది.

ఆ నేపథ్యంలో దేవగుప్తాపు పద్మ పాశ్చాత్య (ఐరోపా ఖండంలో) సమాజంలో పరివర్తన తేవడానికి కృషి చేసిన కార్ల్ మార్క్స్ ప్రస్తావన తెచ్చి, సమాజాన్ని మార్చడం కోసం వ్రాయబడిన రచనలు అప్పటి సమాజానికి దర్పణం పట్టడమే కాక సామాజిక వ్యవస్థ, ఆలోచనా సరళి కూడా మారడానికి కారణమయినాయని అన్నారు. అయితే, "మైన్ కాంప్ఫ్" వంటి గ్రంథాలను, వ్యాసాలను సాహిత్యం క్రింద పరిగణించవచ్చునా అని కూడా కొంత చర్చ జరిగింది.

తెలుగు నాట సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు తేవడానికి కృషి చేసిన వారిలో అగ్రగణ్యులుగా కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావులను సభలో పేర్కొన్నారు. సంఘాన్ని సంస్కరించడానికి కందుకూరి నడుము కట్టిన వారయితే గురజాడ వారు సాహిత్యం వైపు నుండి తమ ప్రయత్నాన్ని కొనసాగించారని వంగూరి చిట్టెన్ రాజు తెలిపారు.
శ్రీ శ్రీ కూడా తెలుగు సాహిత్యంలో ఒక ప్రభంజనం లేపిన వ్యక్తి అని, ఆయన తరువాత వచ్చిన వారిపై ఆయన శైలి, కవితా వస్తువుల ప్రభావం ఎంతో ఉన్నదని అన్నారు. అయితే, కొందరి సాహిత్యం వల్ల మొత్తం సమాజం మారడం అన్నది జరిగినా జరక్కపోయినా, "సాహిత్య" సమాజాన్ని మాత్రం తప్పకుండా మారుస్తుందని ఆయన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అంటే, ఆయా రచయితలు/కవులు ఇతర రచయితలపై/కవులపై మాత్రం ప్రభావం చూపుతారని, సభ్య సమాజంపై కాకపోవచ్చని సారాంశం.

ప్రతి సమాజంలోనూ రుగ్మతలుంటాయని, వాటిని వెలికి తీసే వ్యక్తులు లేకపోతే ఆ రుగ్మతలు నిర్మూలింపబడి సమాజం పురోగమనం చెందబోదని అంటూ, సాహిత్యం సమాజానికి దర్పణం అయి ఆ రుగ్మతలను ఎత్తి చూపేందుకు ఒక శక్తివంతమైన సాధనం కాగలదని శాయి రాచకొండ అన్నారు.

ఏ రచయిత అయినా రాయాలంటే వారి వెనక "రాజపోషకులు" ఉంటారని, వారి రచనలపై ఆయా పోషకుల ప్రభావం ఉండక తప్పదని, రవి పోడూరి అభిప్రాయ పడ్డారు. కృష్ణదేవరాయల ఆస్థానంలోని కవులు, కవిత్రయము, కార్ల్ మార్క్స్, ఇలా ఎవరైనా ఈ కోవకు చెందినవారేనన్నారు. పద్మ పోడూరి ఐరోపాలో ఆంగ్లదేశపు విక్టోరియన్ సాహిత్యాన్ని ఉదహరిస్తూ, సాహిత్యమనేది రచయితల యొక్క దేశ, కాల పరిస్థితులను ప్రతిబింబిస్తుందని, కాలానుగుణంగా మారుతుంటుందని పేర్కొన్నారు.

సాహిత్యం రాసేవారు అందరూ సమాజాన్ని మార్చడమనే ఉద్దేశంతో వ్రాయకపోవచ్చు, కేవలం తమకు అనుభవమైనవీ, సమాజంలో తాము విన్నవి, కన్నవి రాస్తారని, అప్పుడప్పుడు సమాజం ఆ సాహిత్యం వల్ల ప్రభావితమవుతుందని సభలో పలువురు అన్నారు.

కొవ్వలి చంద్రలేఖ ఆంగ్ల/అమెరికా సాహిత్యం గురించి చెబుతూ సమాజాన్ని మార్చడానికి ఎంతో మంది సమాజంలోని లోటుపాట్లను వెలికి తెస్తూ "సెటైర్" ప్రాధాన్యమైన రచనలు చేసారని అన్నారు.

సభకు ముగింపు వాక్యాలుగా శేషగిరిరావు మాట్లాడుతూ, సాహిత్యం సమాజాన్ని మార్చడమనేది జరిగినా అది జరగడానికి సామాన్యంగా కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలో, దశాబ్దాలో పడుతుందనీ, మార్పనేది అప్పటికప్పుడు జరిగేది కాదనీ అన్నారు.

సభలో ఈ చర్చ పూర్తి అయ్యేటప్పటికి తొమ్మిదిన్నర అవడంతో "స్వీయ రచనలు" భాగం జరపడానికి వీలు కాలేదు. వచ్చే నెల "వెన్నెల" కార్యక్రమంలో సమయాన్ని మరింత జాగ్రత్తగా వివిధాంశాలకు కేటాయించి నియంత్రిస్తే తలపెట్టిన అంశాలన్నిటికీ (స్వీయ రచనలతో సహా) చోటుంటుంది. 

సభలో ఉత్సాహంగా పాల్గొన్న తక్కిన వారు సుధేష్ పిల్లుట్ల, మధు పెమ్మరాజు, అరుణ కొవ్వలి, గోపాల్ కొవ్వలి, ఉమ గోపరాజు, బాలమురళికృష్ణ గోపరాజు, సీతారాం అయ్యగారి, కాంత్ జోస్యుల, శ్రీదేవి జోస్యుల, లలిత రాచకొండ, చిలుకూరి సత్యదేవ్.
మొత్తానికి, ఎన్నుకున్న చర్చాంశంతో పాటు పాల్గొన్న సభ్యులందరూ సాహిత్యము, సమాజము ల మధ్యనున్న అవినాభావ సంబంధాన్ని గుర్తించి తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఈ "వెన్నెల" అవకాశం తోడ్పడింది. 

రుచికరమైన భోజనాలతో కార్యక్రమం ముగిసింది.

నెల నెలా తెలుగు వెన్నెల - 01/27/2013


నెల నెలా తెలుగు వెన్నెల - 01/27/2013 - ఆదివారం

ఈ సంవత్సరానికి మొదటి "వెన్నెల" కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. పున్నమి తరువాతి పాడ్యమి నాడు సభలో వెన్నెల బాగా కాసింది.
సాయంత్రం  5:30 గం. లకు మొదలు పెడదామనుకున్న కార్యక్రమం కనీస-జనాభా ("quorum") లేకపోవడం వల్ల దాదాపు ఒక గంట ఆలస్యంగా ప్రారంభమయింది. అందువల్ల కార్యక్రమాన్ని కొంత కుదించ వలసి వచ్చింది.
ఈ ఏడాది క్రమం తప్పకుండా ప్రతి నెలా వెన్నెల కార్యక్రమాలు జరుపుకోవాలని అందరూ తీర్మానించారు.
ప్రతి నెలలోని మూడవ శుక్రవారం సాయంత్రం 7:30 గం.లకు కలుద్దామని నిర్ణయించారు. ఎక్కడ జరిగేదీ కార్యవర్గం ఈ-మెయిలు ద్వారా ప్రకటిస్తుంది.
మన హ్యూస్టన్ వెన్నెలకు బ్లాగు, వెబ్‌సైటులను పునరుద్ధరించాలనీ, వాటిని ఎప్పటికప్పుడు "update" చెయ్యాలనీ, నిర్ణయించడమయింది. ఇప్పటికే తయారుగా వున్న బ్లాగూ, వెబ్‌సిటూ వాడవచ్చని అభిప్రాయం వెలిబుచ్చారు.
క్రిందటి నెల 25న పరమపదించిన కీ.శే. పెమ్మరాజు వేణుగోపాల రావుగారి గురించి ఆయనతో దాదాపు ముప్ఫై ఏళ్ళ పరిచయం ఉన్న వంగూరి చిట్టెన్ రాజు గారు, అనిల్ కుమార్ గారూ మాట్లాడారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పెమ్మరాజు గారి నిండైన జీవితం గురించి క్లుప్తంగా వివరించి, తమ ఆంతరంగిక మితృల్లో ఒకరుగా చిట్టెన్ రాజు గారు ఆయనను పేర్కొన్నారు. అణు-భౌతిక శాస్త్రజ్ఞులు, కవి, నాటక రచయిత, కథకులు, చిత్రకారులు, శిల్పకారులు, ఇలా మరెన్నో రంగాలలో నిష్ణాతులైన శ్రీ పెమ్మరాజుగారితో కొద్ది పరిచయం వున్నవారు కూడా సభలో ఆయనకు నివాళులర్పించారు. నేటి సభలో డా. పెమ్మరాజు గారితో పరిచయం లేనివారు ఆ మహామనీషి గురించి తెలుసుకో గలిగారు.
నెల రోజుల పైన ఆంధ్రదేశంలో పర్యటించిన డా. చిట్టెన్ రాజు గారు తమ అనుభవాలను పంచుకున్నారు. డిసెంబరులో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల నుండి విజయనగరంలో గురజాడ గారి ఇంటిని సందర్శించిన విశేషాలూ, తమకు దక్కిన "లోక్ నాయక్" పురస్కార సభ వివరాలూ, తమ నూట పదహారు కథల సంకలనం ఆవిష్కరించడమూ, దేశ రాజధాని ఢిల్లీలోని సాహిత్య అకాడెమీలో తమ అనుభవాలూ పంచుకున్నారు.
కార్యక్రమం ఆలస్యంగా ఆరింభించడం వలన స్వీయ రచనలకు వ్యవధి లేకపోయింది. వచ్చే నెల వెన్నెలకు అందరూ అనుకున్న సమయానికి హాజరయితే తలపెట్టిన అంశాలన్నీ సక్రమంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని మనవి.

Maruwada Rajeswarao Kadhalu - Oka Sameeksha

మరువాడ రాజేశ్వరరావు కథలు
ఒక సమీక్ష
By Sai Rachakonda, Houston, TX - USA

మూడు నాలుగు నెలల క్రితం రాజు గారు మరువాడ రాజేశ్వరరావు గారి పుస్తకం ఇచ్చినప్పుడు అనుకోలేదు ఆ కథలను ఆయన సమక్షం లోనే సమీక్షించే రోజు వస్తుందని.  అడపా దడపా అక్కడ అక్కడ చదువుతూ అనుభవిస్తూ ఉంటుంటే, ఒక రోజు, మరువాడ వారిని పిలుస్తున్నామని, మరునాడు, నువ్వు సమీక్షిస్తావా అని అడిగినట్టే అడిగి ఆర్డరు వేసేసారు రాజు గారు.   అది ఒక చక్కని అవకాశమని ఇప్పుడు తెలుస్తోంది. 

కథలు రచయిత ఏ భావంతో రాసినా, చదువరి హక్కేమిటంటే తన రంగుటద్దాల్లోంచి  చూస్తూ, తన భావాలకి తగ్గట్లుగా ఆ కథని అన్వయించుకోవడం.  ఇవి నా రంగుటద్దాలు .  

ఈ పుస్తకంలో ఇరవై కథలున్నాయి.  నిజానికి అన్నీ చిన్న కథలే.  రెండు పేజీలనించి ఐదారు పేజీల వరకు.   కథా వస్తువులన్నీ మనకు పరిచయమే, మనం పట్టించుకోని వస్తువులే!  గోడలు, జెండాలు, గీతలు , కలలు, వీటన్నిటిని, మనం చూడని తనదైన భావంతో చూసి రాసిన కథలివి.   అతి సాధారణ మయిన కథా వస్తువులలో అత్యంత అర్థాన్ని చూపించారు రచయిత ప్రతి కథ లోను.  అన్ని వస్తువులు, ఆయనకు సమాజంలో జరుగుతున్న అన్యాయాలకి ప్రతి రూపాలు.  ధన వంతులు, రాజకీయ నాయకులూ, బలవంతులు, బీద ప్రజల్ని, సామాన్యులని, బలహీనుల్ని నిర్దాక్షిణ్యంగా అణచి వేస్తున్నప్పుడు చూడ లేక రచయితగా తన యువత లోని ఆవేశాన్ని, కోపాన్ని వ్యక్తం చేస్తూ, ఒక విప్లవం వస్తుందని నమ్ముతూ, రాసిన కథలివి.  కులం, ధనం ప్రాతిపదికగా ఉన్న వర్గ వైషమ్యాలని ఆయన అంగీకరించ లేదు.  నలభై ఏళ్ళ క్రితం రాసిన ఈ కథల్లో, మనకు స్వాతంత్ర్యం వచ్చి 'ఏం  సాధించాము?' అనే ప్రశ్న కనిపిస్తుంది.  ఇంకొక విషయమేమిటంటే, ఈ కథలు ఏ ఆడియన్సు కోసమో రాసినట్లుగా అనిపించవు.  తనలో ఉన్న సంఘర్షణే ఈ కథల రూపం పొందిందని స్పష్టంగా తెలుస్తుంది.  కొన్ని కథలు చదువుతుంటే మా మెడికో శ్యాం రాసిన కథలని గుర్తుకు తెచ్చాయి. 

యాభై, అరవై, డెబ్భై లలో వచ్చిన సాహిత్యం లో ఒక తెలీని మధన ఉంది.  సమాజాన్ని మార్చాలనే తపన ఉంది.  స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలు కాబట్టి అందరం ఏదో చెయ్యాలనే ఉత్సుకత ఉంది.  దోచుకునే తెల్ల దొరల మీద నుంచి ఇంకా ఎక్కువ గా దోచుకునే నల్లదొరల మీదకి మరలింది సాహిత్యం దృష్టి.  ఆర్ధిక అసమానతలు, కుల మత వర్గ విబేధాలు, పురోగమించడానికి శూన్యమయిన  అవకాశాలు, సమస్యలు తీరడానికి విప్లవాలు రావాలనే ఆశ, నిరుద్యోగం, క్షణ క్షణం కనిపించే జీవన సంఘర్షణ లోంచి పుట్టిన యువ ఆవేశాలు, ఆవేదనలు, రచయితలకి, కవులకి, వారి భావావేశాలకి ములాధారాలయాయి.  అట్లాంటి వ్యవస్థ లోంచి విలువ కట్ట లేని సాహిత్యం వచ్చింది.  మరువాడ వారి కథలు ఆకోవ లోకి చెందినవి. 

గోడ కథలో ఒక ముసలి అవ్వ పేడతో పిడకలు చేసి, ఓ గోడ మీద  ఎండ బెట్టు కుని, అవి అమ్మి వచ్చే పైసలతో కడుపు నింపుకుంటుంటే, ఆ గోడని ఎలెక్షన్ల పోస్టర్లు అతికించడానికి, కంపెనీల ఎడ్వర్టైజ్మెంట్లు వేయడానికి మార్చినప్పుడు జీవనాధారం పోయిన ఆ ముసలి పడే ఆవేదనే 'గోడ' కథ.  చివరలో రచయిత 'అ గోడ స్వతంత్ర భారత దేశం లాగుంది' అన్నప్పుడు గుండె కలుక్కు మంటుంది. చదువరిలో బాధ, కొంత గిల్టీ ఫీలింగ్సు, తప్పవు. 

జెండా కథలో ఓడ కళాసి కొడుకు గురవడికి జెండా కావాలి.  జెండా అంటే స్వతంత్ర మట!  పదిహేను పైసలది.  కాని, ఆపైసలేవి?  ఎవరో పారేసిన, లేక పారేసుకున్న జెండా దొరికినప్పుడు 'స్వతంత్రం వచ్చిన రోజు ప్రతి పేదవాడు, మురిసి పోయినట్టే' వాడూ మురిసిపోయాడు.  అందరిలాగే తను ఆ జెండాని తగిలించుకుందామని అనుకునేటప్పుడు కాని తెలీలేదు 'జెండాలు చొక్కాలున్న వాళ్ళకేగాని, చొక్కాల్లేని వాళ్ళకోసం కాదన్న' సంగతి.  స్వతంత్రం వచ్చింది ఎవరికీ? పాములు బుస కొడుతున్నట్లు న్న గొంతుతో ఉపన్యసిస్తున్న మంత్రి గారికా?  మోసం చేసి ఓ ఆడ పిల్లని తీసుకొచ్చి తాగుతూ బలాత్కారం చేసిన మంత్రి గారి పెద్దల్లుడికా?  చొక్కాలు లేని గురవడి లాంటి బీద ప్రజానీకానికా?  చిన్నజెండాలో పెద్ద ప్రశ్నలు?  సమాధానం తెలిసే తెలీని ప్రశ్నలు! 

చదువు, ఉద్యోగార్హత ఉన్నా, ఉద్యోగం కొనుక్కోగలిగే డబ్బు లేక పోయినా, పెద్ద పెద్ద సిఫారసులు లేక పోయినా, మామూలు ఉద్యోగం రాక పోగా, కనీసం కాయకష్టం కుడా చేసే శరీరం,శక్తి, మధ్య తరగతి మనుష్యులకు ఉండదని చెప్తారు 'ఏమవుతావు' అన్న కథలో! 

పట్టుమని మూడు పేజిలయినా లేని కథలు కావలసినన్ని ఉన్నాయి ఈ పుస్తకంలో.  'టికెట్ లెస్' అన్న కథలో టికెట్ తీసుకోని ప్రయాణికుడికి, టికెట్ కలెక్ట రుకీ మధ్య జరిగే సంభాషణ సరదాగా ఉంటుంది. 'టికెట్ కొనుక్కోలేని వాడికి డెమోక్రసీ లోనూ జైలే, డిక్టేటర్ షిప్ లోనూ జైలే, జైలుకి పంపించడం తప్పించి మీరెవ్వరూ ఏమి చెయ్యలేరు. అయినా నా ప్రయాణం మానను',   అంటూ సీటు మీద మఠం వేసుక్కూర్చున్నాడు టికెట్ లెస్..'  అంటూ ముగిస్తారాకథని.  ఇందులో సోషలిజం కోసం వెతుక్కోవచ్చు, మొండికేసిన వాడితో ఒక ఆఫీసరు పడే అవస్థలు చూడొచ్చు.

సంధ్యా రాగం కథలో సోషలిజం లాంటి ఒక ఐడియల్ వ్యవస్థలో స్వేచ్ఛ ఉండచ్చేమోనని అంటూనే, ఎందులో ఉన్నది స్వేచ్ఛ అని ప్రశ్నిస్తారు రచయిత.  అట్లాగే 'హక్కు' అనే కథలో హక్కంటే ఏమిటో చర్చిస్తారు.  హక్కులు సాధించుకోడానికి, బ్రతుకులు బాగు పడ్డానికి ఏవీ సంబంధం లేనట్టుందని వాపోతారు.  'కూలి వాళ్ళ మీటింగులో మాట్లాడుతూ, కేవలం ప్రాణాలతో కాక, మనుషుల్లా బతికే హక్కు సాధించుకోండి' అని అనిపిస్తారు.  ఈ కథలో కుడా సామాన్యుడి హక్కు పోరాటంలోనించే సాధించ గలదని స్పష్టం చేస్తారు రచయిత.  

సభ్యతకి అసభ్యతకి మధ్య గీత ఎంత స్పష్టమైనదో ఎంత అస్పష్టమైనదో మనకి కనిపింప చేస్తారు రచయిత గీత కథలో.  తిండి లేక పోయినా మధ్య తరగతి మనుషులకి వదులుకోలేని అభిమానం, అర్థం తెలియని సంస్కారం తమ చుట్టూరా ఎన్ని గీతలని గీసి జీవితాలని పరిమితం చేస్తాయో!  పుట్టుకలోను, బతుకులోనే వున్న సంకెళ్ళు అధికారం, అజ్ఞానం విధించినవి.  'గీత చెరిగి పోవాలంటే, సంకెళ్ళు తెగి పోవాలి.  అన్ని సంకెళ్ళు...తెగిపోయి తీరాలి' అని చెప్పిస్తారు రచయిత. 
నాకు నచ్చిన మరో రెండు చిన్న కథానికలు కల, కులంగాడు.  

కల కథ చదువుతుంటే అది కలగా అనిపించలేదు.  అతి సామాన్యుడు జీవితంలో పరిగెడుతూ సమాజం లోని అన్యాయాలకి, అక్రమాలకి, బలైపోతూ, ఎదురు తిరుగుతూ, జీవించే ఒక వాస్తవంలా అనిపించింది.  అందుకే అన్నారేమో రచయిత చివరలో, 'వ్యక్తులకే కాదు, సమాజానిక్కుడా, కలలొస్తాయి.  కలలు కల్పనలుకావు.  వాస్తవమే నిద్రలో - 'కల' రూపు తీసుకుంటుంది! ....కల ఆగిపోయినా వాస్తవం ఆగదు ...' అని.  

'కులం గాడు' మన అందరిలోనూ ఉన్నాడు.  కులం గాడి తో పాటు, జాతి గాడు, వర్గం గాడు, మతం గాడు, భాష గాడు, అందరూ మనందరిలో ఉన్నారు.   ఎక్కడికి పోతారు?  మనం పుట్టినప్పుడే మనకి ఒక ఐడెంటిటి వచ్చింది.  అది లేకపోతె మనకి మనుగడ లేదా? అని ప్రశ్నిస్తారు రచయిత.  కులాన్ని, జాతిని, మతాన్ని, ప్రాతిపదికగా తీసుకునే బదులు, నీతిని, నియమాన్ని, ధర్మాన్ని, గుండెల్లో దాచుకుంటేనో?  అప్పుడు, 'చెట్ల మీద శుభం  పువ్వులు పూస్తాయి, క్షేమం కాయలు కాస్తాయి, హర్షం నదులు ప్రవహిస్తాయి' అన్న ఆశ వ్యక్తం చేస్తారు రచయిత.  "ఏరా? పగటి కలలు కంటున్నావా?"  అని కులం గాడు అడగడం జీవితంలో మనం ఎంత వరకు ఐడియల్స్ అమలు పరచ గలము అని మనకే ప్రశ్న అన్నమాట.  

సూక్ష్మమయిన కథా వస్తువు, పదునైన భావం, మరువాడ వారి  సొత్తులు.  చదివిన తరువాత మన ఆలోచనలలో అయన కథలు కొంత సేపటి వరకు, పచార్లు చేస్తూనే ఉంటాయి. అన్ని కథలు ఏవో ఒక సందేశాన్నిస్తూనే ఉంటాయి.  బలవంతులు బలహీనుల్ని పీడించుకు తినే సంఘంలో ఒక విప్లవం వస్తుందని, బలహీనులు బలవంతులకి ఎదురు తిరిగి నిలవగలరని, అప్పటి మరువాడ వారి ధృఢ నమ్మకం అనిపిస్తుంది ఈ కథలు చదివాక. 

ఆయన విరసానికి సంబంధించిన వాడే గాని, సరసానికి మాత్రం కాదని కుడా అనిపిస్తుంది.  

మరువాడ రాజేశ్వరరావు గారి కథలు మరువ లేనివి.  చదవండి.  

శాయి రాచకొండ
07-Jan-2011