32వ టెక్సాస్ తెలుగు సాహిత్య సదస్సు - సమీక్ష

హ్యూస్టన్ నగరం, టెక్సాస్ - మార్చి 15, 2014

టెక్సాస్‌లో ఆరునెల్లకొకసారి జరుపుకునే తెలుగు పండుగకు ఆతిధ్యం వహించే అదృష్టం ఈసారి హ్యూస్టన్ వాసులకు లభించింది. 32 టెక్సాస్ సాహీతీ సదస్సు మార్చి 15 తారీఖున స్థానిక షుగర్ లాండు లోని అంజలి సెంటర్లో  అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, అందులోనూ ఈ విశిష్ట  సాంప్రదాయానికి అంకురార్పణ చేసిన పెద్దల సమక్షంలో జరుపుకోవడం విశేషం. సభలో వంగూరి చిట్టెన్ రాజు, సత్యం మందపాటి, శాయి రాచకొండ, వై.వి.రావు, గిరిజా శంకర్, మాధవరావు గోవిందరాజు, తుర్లపాటి ప్రసాద్ వంటి సాహితీ ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమమే హ్యూస్టన్ నగరంలో 46 "నెల నెలా తెలుగు వెన్నెల" కూడా అవడం హ్యూస్టన్ నగరవాసులకు ద్విగుణీకృతమైన ఆనందాన్ని, గర్వాన్ని కలిగించింది.
సదస్సును ఆరంభించే ముందు పలువురు అన్నపూర్ణలు ఎంతో రుచికరంగా వండి వడ్డించిన అద్భుతమైన భోజనాలు ఆ రోజు జరగబోయే సాహిత్యపు విందుకు నాంది పలికాయి. దాదాపు వందమందికి "పాట్ లక్" అనబడే ప్రక్రియ ద్వారా ఈ విందుకు ఏర్పాట్లు నిర్వహించిన లలిత రాచకొండగారికీ, అడగ్గానే ఉత్సాహంగా ముందుకొచ్చి తమ పాకశాస్త్ర ప్రావీణ్యతనంతటినీ రంగరించి భక్ష్య, భోజ్యాదులను పంపిన ఆ తల్లులకూ ధన్యవాదాలు. అన్నదాతలూ, సుఖీభవ!

రోజంతా సాగిన ఈ సభకి టెంపుల్, ఆస్టిన్, శాన్ అంటానియో, హ్యూస్టన్ నగరాలనుండి అమెరికా తెలుగు సాహిత్య ప్రముఖులు, యువ రచయితలు, సాహీతీ ఆత్మీయులు (టెక్సాత్మీయులు) పెద్ద సంఖ్యలో విచ్చేశారు. హ్యూస్టన్ సాహీతీ లోకం అధ్వర్యంలో జరిగిన ఈ సభలో సాహితీ విశ్లేషణ, స్వీయ రచనలు, చిక్కుముడి, చిన్నారుల ప్రసంగాల వంటి ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి.

సమన్వయకర్త చిలుకూరి సత్యదేవ్ అతిధులని సాదరంగా ఆహ్వానించగా, చిన్నారి లాస్య ధూళిపాళ రాయప్రోలు సుబ్బారావుగారి దేశభక్తి గీతం ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా’ చక్కగా ఆలపించడంతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. తర్వాత స్పందన అక్కరాజు మాట్లాడుతూ తెలుగుని అభిమానించడానికి ‘దేశ బాషలందు తెలుగు లెస్స, ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్’ లాంటి  ఉపోద్ఘాతాల అవసరం లేదు, మన మాతృబాషని మనం ప్రేమిస్తామని చెప్పిన స్పష్టమైన తీరు సభికులను ఆకట్టుకుంది.  
మొదటి విడత సాహిత్య పరిశీలనా విభాగం సత్యం మందపాటి అద్యక్షతన జరిగింది. దీనిలో మొదట పండిత పామర కోణంలో చాటు చాటుపద్యాలపై ప్రసాదరావు వెన్నెలకంటి ప్రసంగిస్తూ తెనాలి రామకృష్ణుడు, శ్రీనాథుడు వంటి కవుల చాటుపద్యాలతో పాటు పామరజనుల నుండి వెలువడిన చాటువులను కూడా ఉటంకించి ప్రేక్షకులను అలరించారు. భారతదేశం నుండి విచ్చేసిన జీడిగుంట విజయసారధి తమ తండ్రి జీడిగుంట రామచంద్రమూర్తిగారి రచనలపై కొంత విశ్లేషించి, ఆయన వ్రాసిన "గుడిలో పువ్వు" కథను చదివి ఆహూతుల హృదయాలలో ఆర్ద్రతను నింపారు. చక్కటి గళంతో, శాస్త్రీయంగా కొన్ని కృతులను పాడుతూ కర్ణాటక సంగీతంలోని కీర్తనలలో వుండే తత్వబోధను సీతారాం అయ్యగారి విశదీకరించారు. చివరగా భారతదేశం నుండి ఈ దేశానికి చుట్టపుచూపుగా వచ్చిన ప్రఖ్యాత రచయిత్రి, కవయిత్రి రేణుక అయోల తమ కథనొకటి చదివి, తమ పూర్వీకులు, భగవాన్ రమణమహర్షికి ఆంతరంగికులు అయిన కావ్యకంట గణపతి ముని గురించి ప్రస్తావించారు.

చలన చిత్రాలు తెలుగు వారికి బాగా దగ్గరైన వినోదం కావడంతో మాధవరావు గోవిందరాజు గారు చిత్ర గీతాలపై అడిగిన ప్రశ్నలకి సభికులు ఉరకలేసిన ఉత్సాహంతో సమాధానాలు చెబుతూ పాల్గొన్నారు.

మొదటి విడత స్వీయ రచనల విభాగం వై.వి.రావు అద్యక్షతన జరిగింది.
తెలుగు బాష, ప్రాంతీయ భావాలలో ఎన్నో అపోహలు చలామణిలో ఉన్నాయని, వీటిని తొలిగించేందుకు చారిత్రక నేపధ్యం తెలుసుకోవల్సిన అవసరముందని హరి మద్దూరి తెలియజేసి, వారి పరిశోధనని స్లైడ్ల ద్వారా చూపారు. తరువాత అక్కినేనితో వారికున్న ఏళ్ళ అనుబంధాన్ని కుటుంబరావు ప్రస్తావించగా, అమెరికాలో పుట్టి, పెరిగిన చంద్రలేఖ మాతృ బాషపై తన మనోభావాలను పంచుకుని ‘బంగారు పాప’ పాటతో ముగించారు.  రాయుడు వృద్ధుల నిజజీవితంలో జరిగిన ఒక సంఘటనను చక్కటి కథ రూపంలో చదివి వినిపించగా, కోసూరి ఉమా భారతి తమ రచనా వ్యాసంగానికి నేపథ్యాన్ని, తమ చిన్నప్పటి అనుభవాలనూ ఎంతో ఆసక్తికరంగా చెప్పారు.

సాహిత్యానికి, సంగీతానికి, తెలుగుదనానికి పెద్ద పీట వేసిన సినీ దర్శకుడు కళాతపస్వి విశ్వనాధ్ సినీగమనాన్ని, జ్ఞాపకాలని ‘విశ్వనాదామృతం’ అనే ప్రాజెక్ట్ ద్వారా పదిలపరిచే ప్రయత్నం చేస్తున్న రాం చెరువు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ కార్యక్రమపు అంశాల కూర్పుని విరామ సమయంలో సభికులకి ప్రదర్శించారు. పకోడీలు తింటూ ఆ  ప్రివ్యూను వీక్షించి వారి ప్రయత్నాన్ని ఎంతగానో మెచ్చుకున్నారందరూ.

విరామం తరువాత పుస్తక పరిచయం కార్యక్రమాన్ని వంగూరి చిట్టెన్ రాజు నిర్వహిస్తూ, సామాన్యంగా ఎంతో హంగు, హడావిడీలతో జరిగే ఈ పుస్తకావిష్కరణ ఏ మాత్రం ఆర్భాటాలు లేకుండా జరుపుకుంటున్న రచయిత్రి వెన్నెలకంటి మాణిక్యాంబను ప్రశంసించారు. ఆమె కొన్నేళ్ళుగా వ్రాసుకున్న పాటలను "భావాలాపన" అన్న పేరుతో చక్కటి గ్రంథరూపంలో ప్రచురించారు. అందులోని కొన్ని గేయాలను అద్భుతంగా ఆలపించారామె. ఆ పుస్తకం అమ్మకానికి కాదని, ఎవరైనా ఆసక్తి గలవారు తీసుకోవచ్చునని, ఆ పాటలను ఇతరులు పాడుకోవడమే తమకు తగిన పారితోషికమనీ చెప్పకనే చెప్పారామె.

రెండవ సాహిత్య పరిశీలనా విభాగం శాయి రాచకొండ నిర్వహించారు.
ప్రథమంగా కరుణశ్రీ సాహిత్యంలోని సరళత్వాన్ని, సాహిత్య విలువలనూ సత్యం మందపాటి సోదాహరణంగా వివరించారు. పిదప పోతన భాగవతంలోని కొన్ని ఆణిముత్యాలను తుర్లపాటి ప్రసాద్ ఎంతో చక్కగా ఉటంకిస్తూ అందులోని భక్తితత్వాన్ని ప్రేక్షకులకు అనుభవింపజేసారు.
యెమెన్ నుండి రికార్డు చేసి పంపిన బాలాంత్రపు దంపతుల హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు విన్నప్పుడు ప్రాంగణం సభికుల కరతాళ ధ్వనులతో నిండిపోయింది. నాటకీయ ఫక్కీలో రాగయుక్తంగా బాలాంత్రపు శారద పాడిన పద్యాన్ని అందరూ ఎంతో మెచ్చుకుని, అప్పుడే అయిపోయిందా అనుకున్నారు.
తరువాత సుమ నూతలపాటి తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా పేరుగాంచిన వారి తాతగారు ఉన్నవ లక్ష్మీ నారాయణ గారితో తమ అనుబంధాన్ని పంచుకున్నారు.
"నాకు నా దేశం, నేను నా దేశానికి" అన్న శీర్షికతో, మన దేశానికి మనమేమిచ్చామన్న విషయంపై తమ భావాలను ప్రేక్షకులతో పంచుకుంటూ, యాభయ్యేళ్ళ క్రితం అమెరికా అధ్యక్షులు జే.ఎఫ్.కే. అన్న "నీ దేశం నీకేమిచ్చిందని అడగకు, నువ్వు నీ దేశానికేమిచ్చావని అడుగు" వాక్యాన్ని గుర్తుకు తెచ్చారు పవన్ అన్నలూర్. 

కార్యక్రమంలో చివరగా స్వీయ రచనల విభాగం తుర్లపాటి ప్రసాద్ గారి అద్యక్షతన జరిగింది.
దీన్ని ప్రారంభిస్తూ టెక్సాస్ రాష్ట్రపు "గిరీశం"గా పరిగణింపబడే గిరిజా శంకర్ తమ “రుక్కుల”లోంచి ఒక కథను వినిపించి నవ్వులతో ముంచెత్తారు.
తమ ప్రసంగాన్ని రెండు-మూడు ఛలోక్తులతో ఆరంభించిన ఇర్షాద్ జేంస్ తమ రచన "విదేశీయుడు"లో భవిష్యత్తులో తెలుగునాట ఎటువంటి రాజకీయ పరిస్థితులు చోటు చేసుకుంటాయో ఒక హాస్య కథానిక రూపంలో చదివి ప్రాంగణాన్ని నవ్వులతో నింపడమే కాక ఆలోచింపజేసారు.
యువకవి శరత్ సూరంపూడి ఎంతో సరళమైన భాషతో, చక్కటి మలుపులతో వ్రాసిన భావకవిత్వం సభికులని ఆకట్టుకున్నాయి. తరువాత ఉమ పోచంపల్లి గారు తమ కవితల సంపుటిలోంచి ఒక కవితను, తమ స్వానుభవాలు ఆధారంగా చేసుకొని వ్రాసిన ఒక చిన్న కథను వినిపించారు.
 ముగింపుగా డా. వేంకట రాజు త్వరలో రాబోతున్న జయ నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ “ఉగాది” అనే కవితనూ, భారతదేశంలో జరుగుతున్న రాష్ట్రవిభజనకు సంబంధించి సందర్భోచితంగా “నా తెలంగాణ” అనే కవితనూ రాగయుక్తంగా పాడి వినిపించారు.

హ్యూస్టన్ నగరంలోని తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు మారుతి రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ తరఫున సాహిత్య సంబంధమైన కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ప్రోద్బలం ఉంటుందని వక్కాణించారు.

షడ్రుచుల వంటి అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన కార్యక్రమాన్ని “హ్యూస్టన్ సాహీతీ లోకం” కార్యవర్గం తరఫున మధు పెమ్మరాజు సహాయ, సహకారాలు అందించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతాభివందనం తెలియజేస్తూ సదస్సును ముగించారు.

3 comments:

  1. బెమ్మాండంగా ఉంది సా(వీ సమీక్ష!!

    ReplyDelete
  2. చాలా బావుంది. సభలు విజయవంతంగా జరిగినందుకు సంతోషం. బొమ్మల కింద ఎవరెవరో శీర్షికలు రాస్తే ఉపయోగంగా ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. మీ సలహా పాటించామండీ - బొమ్మల్లో ఎవరెవరో ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు.

      Delete