రమణ బాలాంత్రపు
మన ప్రాచీన సాహిత్యంలో ద్వందార్థాల చతురోక్తి ఎప్పటినుండో ఉంది.
తెలుగు సాహిత్యంలో "పుష్పలావికలు" (అంటే పువ్వులు అమ్మే యువతులు), "ప్రపాపాలికలు" (చలివేంద్రాలు నడిపే పడుచులు), "శాలిగోపికలు" (పంటకావలి వనితలు) కనిపిస్తారు. వీళ్ళందరూ ఎంతో చక్కగా సరసులతో చతురోక్తులు, కవ్వింఫు సంభాషణలూ చేస్తూ ఉండే వారు (flirting). కవులు తమ ప్రతిభ కొద్దీ వీటిని తీర్చి దిద్దారు. కొందరు కవులయితే మరీ శృతిమించిపోయేవారు.
ఈ వేళ పుష్పలావికల గురించి ముచ్చటించుకుందాం.
పుష్పలావికా - ప్రపాపాలికా వర్ణనలు సంస్కృత ప్రాకృతాలలో విరివిగా ఉండేవి. తెలుగులో వీటికి రాయలవారే శ్రీకారం చుట్టారు. వీళ్ళను వీటీగణంగానూ కొనుగోలుదారులను విటసమూహంగానూ క్లుప్తీకరించిన ఘనత కూడా ఆయనదే. అటుపైని కవులందరికీ ఇదే రాజమార్గమయింది.
పూలు కొనుక్కోడానికి వచ్చిన వారడిగే కొంటె ప్రశ్నలకు పుష్పలావికలు ఇచ్చే చిలిపి సమాధానాలు వినండి.
మాటలగారడీ కోసం రాయలవారి “ఆముక్తమాల్యద” నుండి ఈ పద్యం చిత్తగించండి.
వెలఁది! యీ నీ దండ వెల యెంత? నా దండ
కును వెలఁబెట్ట నెవ్వని తరంబు?
కలువ తావులు గాన మలికదంబకవేణి!
కలువతావులు వాడకయ కలుగునె?
కడివోదు నాకిమ్ము పడఁతి! యీ గేదంగి
నన కడివోమి ముందఱికిఁ చూడు
జాతులే వంబుజేక్షణ! పద్మినులు సైత
మును నున్నయెడ జాతులునికి యరుదె?
యనుచుఁ దొలినుడి నభిలాష లెనయ మూఁగి
పలుకుతోడనె నర్మగర్భంబుగాఁగ
నుత్తరము పల్లవశ్రేణికొసఁగు చలరు
లమ్ముదురు పుష్పలావిక లప్పురమున
పూలను విక్రయించే యువతులు (పుష్పలావికలు) కొనడానికి వచ్చిన విటులు (పల్లవులు) వారి నర్మగర్భ సంభాషణ - ఇందులో చూపించారు రాయలవారు.
విటుడు అడుగుతున్నాడు: ఓ యువతీ! (వెలఁది), ఇదిగో నీ దండ వెల ఎంత? ఇక్కడ ఈ అల్లరిపిల్లాడి ఉద్దేశం - పూల దండమాత్రమే కాదు. నీ బాహువు లేదా నీ సాన్నిధ్యం - దాని ఖరీదు ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని గ్రహించింది ఆ పుష్పలావిక. గడుసుగా ఎదురు ప్రశ్న వేసింది. నా దండ వెల చెప్పడం, వెల కట్టడం ఎవడితరం నాయనా? అంది. రెండు విధాలా సమాధానం అందింది కుర్రవాడికి.
తుమ్మెదల గుంపులాంటి జడదానా! (అళి-కదంబ-వేణి) సరే ఇంతకీ కలువ(ల) తావులు - పరిమళాలు (తావి+లు) కనిపించడంలేదు నీ అంగడిలో? అన్ని రకాల పూవులూ ఉన్నాయిగానీ, కలువపువ్వులు కనిపించవేమిటన్నది పైకి ప్రశ్న. నాయికల నాభిని కలువపువ్వుతోను నీటి సుడితోనూ పోల్చడం కవుల పద్ధతి. నాభిప్రదేశాలు (తావు=చోటు, తావులు)కనిపించవేమిటి - అన్నది అయ్యగారి ఆంతర్యం. ఆ అమ్మాయి ఇంతకన్నా గడుగ్గాయి కదా! అంటోంది - ఎక్కడైనా కలువపువ్వులకి పరిమళాలు వాడిపోకుండానే గుప్పుమంటాయా? - అని రెట్టించింది. కలువలూ, పొన్నలూ, మొగలిపువ్వులూ - ఇలా కొన్ని నలిగినకొద్దీ, వడిలినకొద్దీ పరిమళాలు విరజిమ్ముతుంటాయి. ఇవి తాజా కలువలు. అప్పుడే - వాడకముందే - తావులు విరజిమ్ముతాయా? అన్నది పైకి కనిపించే సమాధానం. నాభి వగైరా ప్రదేశాలు వాడకముందే (వాడుట=ఉపయోగించుట) కనిపించేస్తాయా - అన్నది లోపల వినిపించే సమాధానం (నర్మం).
ఓ పడతీ! ఇదిగో ఈ మొగలిపువ్వు (గేదంగి - నన) అసలు నలిగినట్లే లేదు (కడి+పోదు). నాకు ఇయ్యి - అని ఒక తాజా మొగలిపువ్వును చూపిస్తూ అడిగాడు ఆ విటుడు. కలువపువ్వు నాభికి సంకేతమైనట్టే మొగలి పువ్వు మరొక దానికి సంకేతం. బదులిస్తోంది ఆ వగలాడి. అవునవును ఈ పువ్వు (నన) నలగకపోవడం వడిలిపోవడం - అదంతా ముందు ముందు తెలుస్తుందిలే - ముందరికి చూడు - అనేసింది. కడి అనే మాటకి అన్నపుముద్ద అని మరొక అర్థం. నా విరహం తట్టుకోలేవు. తిండి సహించకపోవడం ముద్ద దిగకపోవడం (కడి-పోమి) ఇదంతా నీకు ముందు ముందు తెలుస్తుంది. దృష్టి సారించు - అనడం ఆవిడ ఆంతర్యం.
(తమిళ సినిమా "సర్వర్ సుందరం" లొ విశ్వనాథన్-రామ్మూర్తిల సంగీత సారధ్యంలో సుశీల-పీ.బీ.శ్రీనివాస్ పాడిన యుగళగీతం మహాకవి కణ్ణదాసన్ గారు వ్రాసిన పాట లో "పోగ పోగ తెరియుం - ఇంద పూవి వాసం పురియుం" అన్నారు. అంటే "పోగా పోగా తెలుస్తుంది - ఈ పూవు వాసన అర్థం అవుతుంది అని అర్థం. అక్కడ కూడా మనం చర్చించుకుంటున్న అర్థమేనేమో అని నా నుమానం.)
ఇంక మన పద్యానికి వస్తే, పద్మాల్లాంటి కన్నులున్నదానా! (అంబుజేక్షణా!) నీ అంగడిలో జాజులు (జాతి=జాజి) ఏవీ? అన్నట్టుగా నువ్వు ఏ జాతిదానవు అని అడిగాడు. ఆ నెరజాణ ఇలా ఎదురు ప్రశ్న వేస్తోంది: పద్మినులు కూడా ఉన్న అంగడిలో జాజులుండడం (ఉనికి) అరుదా?ఆశ్చర్యమా? అని అడిగింది. పద్మినీ జాతి స్రీలే ఉన్నచోట (ఉన్నయెడన్) మిగతా జాతులవారు (శంఖిని, హస్తిని, చిత్తిని జాతులు) ఉండరా?అది అంత అరుదా? అన్నది నర్మం.
ఈ విధంగా మొదటి మాటనుంచీ (తొలినుడిన్) కోరికలు (అభిలాషలు) స్పష్టమయ్యే విధంగా కమ్ముకొని (మూఁగి) ప్రశ్నిస్తున్న విటులకు (పల్లవ శ్రేణికిన్) పూలు అమ్ముతున్నారు (అలరులు+అమ్ముదురు) ఆ పుష్పలావికలు.
మూలం; ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారి సంపాదకత్వంలో దాసరి లక్ష్మణస్వామి గారి "వర్ణన రత్నాకరము" అనే గ్రంథ సంపుటిలో రెండవ సంపుటి. పై పద్యానికి వివరణ ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు.
వచ్చేవారం మరొక పుస్పలావికను కలుద్దాం.
No comments:
Post a Comment