వంట చెయ్యడం అనేది అరవై నాలుగు కళల్లో అతి కష్టమైన కళ. ఈ స్టేట్మెంట్ ని సవాలు చేసే ధైర్యం ఎవరికీ లేదని నాకు తెలుసు. రోజూ తినే వెధవ తిండికి ఇంత గోల,కాంప్లికేషను,హడావిడి అవసరమా అనుకునే రుషులను వదిలేసి మనలాంటి మామూలు మనుషుల సంగతికి వద్దాం. రోజూ చేసే వంట ఐనా వొళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యకపోతే అది మన్ని ఖాతరు చెయ్యదు. దానిష్టం వచ్చినట్టు అఘోరిస్తుంది.
మా నాన్నగారి వైపు అంతా కోనసీమ విత్తనం. వాళ్ళకి నల-భీములు తప్ప మామూలు మానవమాత్రులు కళ్ళకి ఆనరు. అదేం విచిత్రమో కోనసీమ వాళ్ళందరూ పుట్టడమే విపరీతమైన వంట విఙ్ఞానంతో పుడతారు. భగవంతుడు వాళ్ళ బొమ్మల్ని తయారు చేస్తున్నప్పుడు పాకశాస్త్రం అంతా వాళ్ళ సర్క్యూట్స్ లో ముందుగానే ఫాబ్రికేట్ చేసేసి అప్పుడు భూమ్మీద పడేస్తాడు. అందుకనే వాళ్ళకి వంట చెయ్యడం రాని వాళ్ళని చూస్తే వింతగానూ రోతగానూ ఉంటుంది.
మా అత్తయ్య మా ఇంటికి వచ్చినప్పుడల్లా మా అమ్మకి గండం. అదే కిచెను, అవే పాత్ర సామాన్లు, అదే పొయ్యి, అవే కూరగాయలు, ఆవాలు, మెంతులూ, దిబ్బా దిరుగుండమూను. కానీ వాటికి కోనసీమ వాళ్ళ వాసన పసిగట్టడం వచ్చో ఏమో మరి. మా అమ్మ వంట చేస్తున్నప్పుడు ఆవాలు మెంతులు ఇంగువ వగైరాలు పోకిరీ వేషాలు వేస్తాయి. చెప్పిన మాట వినవు. వంకాయి, బెండకాయి, కాకరకాయి మొదలైన కూరలు హిందీ సినిమాలో అప్పుడే స్పృహ వచ్చిన హీరొయిన్ లాగా "మై కౌన్ హూ?" అనడుగుతూ ఉంటాయి. ఐడెంటిటీ క్రైసిస్... గుమ్మడికాయి పులుసుకే కాదు, అది తింటున్నవాళ్ళకి కూడా అదేమిటో తెలియని సందిగ్ధావస్థ.
అదే మా అత్తయ్య వంటింట్లోకి అడుగు పెట్టిందా, "అటేన్షన్" అని ఒక ఉరుము వినపడుతుంది కిచెన్ లోని సమస్త వస్తు పరికరాలకీ. వెంటనే పోపుడబ్బాలో రౌడీ వేషాలు వేస్తున్న శెనగపప్పు, మినప్పప్పు, ఎండు మిరపకాయలూ, ధనియాలూ ఎట్సెటెరా గబగబా తలలు దువ్వేసుకుని, చొక్కా బొత్తాలు పెట్టేసుకుని, మొహాలు కడిగేసుకుని, చేతులు కట్టేసుకుని బుధ్ధిమంతులైపోయి మా అత్త చెప్పిన మాట వినేస్తాయి. టొమాటో పప్పు అచ్చం టొమాటో పప్పులానే ఉంటుంది. కందా-బచ్చలి కూరలో రెండో మూడో అమృతం చుక్కలు పడ్డాయేమో అని అనుమానం వస్తుంది మనకి. ఈ వివక్ష,అన్యాయం చూసిన ప్రతీసారీ మా అమ్మకి బాధ ఉడుకుమోత్తనం కలగలిపి వచ్చేస్తూ ఉంటాయి పాపం.
మా అమ్మమ్మ... మహానుభావురాలు. కోనసీమలో పుట్టకపోయినా కోనసీమ వాళ్ళకి తన వంటతో సమాధానం చెప్పగలిగిన ఏకైక సాహసురాలు. మా అత్తయ్యలూ వాళ్ళూ మా అమ్మమ్మ కనపడగానే భక్తిగా పక్కకి తప్పుకునేవారు. "మాగాయ ఆవిడ పెట్టినట్టు మనం కూడా పెట్టలేం తెలుసా?" అని గుసగుసలాడుకునేవారు. అలాంటి అమ్మమ్మకి పుట్టిన వాళ్ళు మా అమ్మా, పిన్నులు..... ఒక్కళ్ళకైనా వంట సరిగ్గా చేతకాదు. మా అమ్మమ్మ బతికున్నంత వరకూ నేను ఆవిడ చేతి వంటే తిన్నాను. ఆవిడ పోయాక తప్ప నాకు వంట విలువ తెలీలేదు. మా అమ్మ పెట్టే "పదార్థాలు" తిని కళ్ళనీళ్ళు పెట్టుకుంటే మా అమ్మమ్మని గుర్తు చేసుకుని ఏడుస్తున్నాననుకున్నారంతా. అప్పుడొక విచిత్రం జరిగింది. సింపుల్ కంది పచ్చడి కూడా కన్ఫ్యూజన్ లేకుండా చెయ్యలేని మా అమ్మ బ్రహ్మాండంగా మాగాయ పెట్టేసింది ఆ యేడాది. అలా ప్రతీ యేడాది ఈ విచిత్రం జరుగుతోంది. నా మీద ప్రేమతో మా అమ్మమ్మే దేవుడి దగ్గర పర్మిషను తీసుకుని ప్రతీ యేడూ ఊరగాయల సీజన్లో మా ఇంటికొచ్చి మా అమ్మను ఆవహించి ఆ ఊరగాయలన్నీ పెట్టిస్తోందని నాకు అర్ధమైపోయింది.
ఇలా కాలం గడుస్తూండగా, నాకు కూడా వంట చేసే వయసు, ఆగత్యం వచ్చి పడ్డాయి. నేను సగం కోనసీమ విత్తనం, సగం కాదు. దాంతో వంటింట్లో వస్తు పరికరాలకి పెద్ద డైలమా వచ్చి పడింది నా మాట వినాలా వద్దా అని. పోపు డబ్బా కి నాలో మా అత్తయ్య పోలికలు కనపడి కొంచెం మెత్తపడింది. బీరకాయి ఆనపకాయి క్యాబేజీ లాంటి పప్పు కూరలు నన్ను చిన్న చూపు చూసి బహిష్కరించాయి. సగం కిచెను ఇటువైపు, సగం కిచెను అటువైపు. హోరా-హోరీ,బాహా-బాహీ,ముష్టా-ముష్టీ యుధ్ధం జరిగింది. ఇప్పటికీ ఆ యుధ్ధం కొనసాగుతూనే ఉంది. సగం వంటలు "నేనెవరో చెప్పుకో చూద్దాం!" అని తినేవాళ్లని కవ్విస్తూ ఉంటాయి. సగం వంటలు "కోనసీమ హస్తవాసి ఎక్కడికి పోతుందీ?" అనిపిస్తాయి. అప్పుడు నేను వినయంగా చెప్తూ ఉంటాను..... "కోనసీమా? తొక్కా? నేను మా అమ్మమ్మ మనవరాలిని" అని.
కొస మెరుపేంటంటే, మా పెద్దమ్మ కూతురిని కోనసీమ వాళ్ళకిచ్చారు. ఒకసారి వాళ్ళింటికెళ్ళాను. మా అక్క అత్తగారు వంట చేసింది. క్యాబేజీ కూర,వంకాయి కూర,ధప్పళం,పులిహోర. చార్మినార్ ఏరియాలో ఒక ఉడిపీ హోటలువాడు వెజ్ బిర్యానీ చేస్తాడు. తమ తమ పూర్వ జన్మల్లో ఇవన్నీ ఆ వెజ్ బిర్యానిగా పుట్టినవే. పూర్వజన్మ వాసనలు పోలేదింకా. మొత్తమ్మీద ఒక పెద్ద వెజ్ బిర్యాని తినేసి, తరతరాలుగా కోనసీమ మీద చూపించిన పక్షపాతానికీ, మిగిలిన ప్రాంతాల వాళ్ళకి చేసిన అన్యాయానికి భగవంతుడు సిగ్గు పడి మా అక్క అత్తగారిని పుట్టించి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడని సంతోషించాను. స్వస్తి.
No comments:
Post a Comment