హ్యూస్టన్ నగరం, శనివారం, ఏప్రిల్ 26, 2014
ఏప్రిల్
26న కేటీలోని సింకో రాంచ్ గ్రంధాలయంలో
47వ "నెల నెలా తెలుగు
వెన్నెల" కార్యక్రమం జరుపుకున్నాము. కార్యక్రమాన్ని అనుకున్న సమయంకన్న కొద్దిగా ఆలస్యంగా ఆరంభించినా రసవత్తరమైన అంశాలతో ఎంతో తృప్తికరంగా జరిగింది.
కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ చిలుకూరి సత్యదేవ్ గత నెలలో నగరంలో
ఎంతో విజయవంతంగా నడిచిన టెక్సాస్ సాహిత్య సదస్సును జ్ఞాపకం చేసి, ప్రస్తుత సమావేశంలోని
అంశాలను క్లుప్తంగా పేర్కొన్నారు.
నాటి మొట్టమొదటి
అంశం "సామెతల అంతాక్షరి"ని పరిచయం చేస్తూ సామెతలు ప్రసంగాలకు క్రొత్త అందాన్నిస్తాయనీ,
దాదాపు అన్ని భాషల్లోనూ సామెతలనేవి వుంటాయని చెప్పి కొన్ని ఉదాహరణలిచ్చారు సత్యదేవ్.
అంతాక్షరి కార్యక్రమాన్ని సమన్వయకర్త రవి పొన్నపల్లి గారు చక్కగా నిర్వహించారు. విచ్చేసిన
ప్రేక్షకులందరినీ రెండు జట్లుగా విభజించి, పలు ఆవృతాలు నడిపారు. అంతాక్షరి మాత్రమే
కాకుండా "శంకర్ దాదా జిందాబాద్" అన్న శీర్షికతో సామెతలను ఆంగ్లంలోకి అనువదించి
వాటికి మూలమైన తెలుగు సామెతలేమిటో చెప్పమని అడిగారు. కేవలం ప్రేక్షకులుగా మాత్రమే ఉండిపోకుండా
గదిలోని ఇరవై మందీ ఉత్సాహంగా పాల్గొనే విధంగా నడిచింది ఈ పోటీ. ఈ ప్రక్రియ ద్వారా ఎన్నో
క్రొత్త సామెతలు నేర్చుకునే అవకాశం కలిగింది.
తరువాత మధు పెమ్మరాజుగారు
తమ బ్లాగునుండి "జిరాక్స్ కాపీ" అనే ఒక హాస్యభరితమైన అధ్యాయాన్ని చదివి అందరినీ
కడుపుబ్బ నవ్వించారు. మనం రోజువారీ జీవితంలో ఎదుర్కునే పరిస్థితులను ఎంతో చమత్కారంగా
వర్ణిస్తూ, అద్భుతమైన ఉపమానాలతో ఎంతో చక్కటి రచనను ప్రేక్షకులకు వినిపించారు.
"పుస్తక
పరిచయం" శీర్షికలో రవి పొన్నపల్లి గారు
"నడిచే దేవుడు" పుస్తకాన్ని సమీక్షించారు. కంచి పరమాచార్య శ్రీ
చంద్రశేఖరానంద సరస్వతి శంకరాచార్యులవారి గురించి నీలంరాజు వెంకటశేషయ్యగారు రచించిన ఈ గ్రంధంలో పరమాచార్యులతో
రచయిత తమ అనుబంధానికి సంబంధించిన విషయాలే కాకుండా ఇతర భక్తుల అనుభవాలు
కూడా వివరంగా రచించారు. భారతదేశ స్వాతంత్ర్య
పోరాటం సమయంలోనూ, దేశ రాజ్యాంగ రచన
సమయంలోనూ డా. అంబేద్కర్ తదితరులతో
పరమాచార్యులు జరిపిన చర్చల వివరాలు ఎంతో
ఆసక్తికరమైన ఘట్టాలు.
కాకినాడ
వాస్తవ్యులు, ప్రస్తుతం వారి కుమారుని వద్ద
కొన్ని నెలలు గడపడానికి హ్యూస్టన్
నగరానికి వచ్చిన అయ్యగారి శ్రీరామమూర్తి గారు తెలుగు భాష
యొక్క తీయదనంతో పాటు అందులోని వైవిధ్యాన్ని
గురించి కూడా ప్రసంగించారు. వివిధ
దైనందిన సంఘటనల్లో తెలుగు భాషను వేర్వేరు వ్యక్తులు
ఎంత భిన్నంగా వాడతారో సోదాహరణంగా వివరించారు.
ఇంత చక్కటి సాహిత్య సంబంధమైన కార్యక్రమానికి ముగ్ధులై, అప్పటికప్పుడు ప్రేరితులై శ్రీనివాస్ రాచపూడి గారు తమకు నచ్చిన
శ్రీశ్రీ కవితలను
వినిపించారు. ఆ నేపథ్యంలో, 1980వ దశకంలో శ్రీశ్రీ అమెరికా
దేశ పర్యటన చేస్తూ హ్యూస్టన్ నగరానికి వచ్చినప్పుడు వంగూరి చిట్టెన్ రాజుగారింట అతిథిగా
ఉండి "సిప్రాలి" రచించిన సంఘటనను సభికులు జ్ఞాపకం చేసుకున్నారు.
తరువాత
గోపాలకృష్ణ గూడపాటి గారు మే 3వ
తేదీన జరుగనున్న "మన బడి" సాంస్కృతిక
కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించారు.
స్వీయరచనల
విభాగంలో రవి పొన్నపల్లి గారు
"అత్తారింటికి దారేది" సినిమాలోని ఒక పాటకు చక్కటి
పారడీని రచించి రాగయుక్తంగా పాడి అందరినీ అలరించారు.
చిలుకూరి సత్యదేవ్ గారు "మాతృదేవోభవ" అన్న కవితను చదివి
వినిపించారు.
ఈ నెల ‘వెన్నెల’కు పలువురు
ప్రేక్షకులు మొదటిసారి రావడం, అందునా భారతదేశం నుండి మూడు నెలల
క్రితమే ఉద్యోగరీత్యా హ్యూస్టన్ నగరానికి వచ్చిన పవన్ కుమార్ గారు
సకుటుంబంగా వచ్చి ఎంతో ఉత్సాహంగా
పాల్గొనడమూ ఆనందదాయకమైన విషయం.
చిలుకూరి
సత్యదేవ్ గారు మున్ముందు జరుగబోయే
"వెన్నెల" కార్యక్రమాల వివరాలు చెబుతూ కార్యక్రమాన్ని ముగించారు.
No comments:
Post a Comment