43వ "నెల నెలా తెలుగు వెన్నెల" - సమీక్ష

హ్యూస్టన్ నగరం, శనివారం, జనవరి 25, 2014 

హ్యుస్టన్ తెలుగు సాహితీ వేదిక "నెల నెలా తెలుగు వెన్నెల" కొత్త సంవత్సరాన్ని హాస్యరస ప్రధానమైన అంశాలతో ఆహ్లాదంగా ప్రారంభించింది, సభకు విచ్చేసిన సాహితి ప్రియులతో హ్యూస్టన్ మహానగరంలోని చక్కెరపాలెం (సుగర్‌లాండ్) లోని గ్రంథాలయం ప్రాంగణం నిండిపోగా, వేదిక సమన్వయకర్త సత్యదేవ్ గారు సాహితీ బంధువులకి స్వాగతం పలికి, 43వ వెన్నెల కార్యక్రమ అంశాలను, వరుసక్రమాన్ని సభకు తెలియజేసారు.   
  
ముఖ్యాంశాన్ని శాయి రాచకొండగారు ప్రారంభించి తెలుగు సాహిత్యంలో హాస్యపు పరిణామక్రమాన్ని తనదైన శైలిలో, ఉదాహరణలతో చక్కగా వివరించారు, ఆ తరువాత జరుక్ శాస్త్రి, మాచిరాజు దేవీప్రసాద్ గార్ల పారడీలు చదివి కడుపుబ్బ నవ్వించారు.  ఎం. శివకామయ్యగారు రచినిచిన "Humor in Telugu Literature" వ్యాసాన్ని చదివి వినిపించారు. అందులో తెలుగు హాస్య సాహిత్యంపై సంస్కృత, ఆంగ్ల సాహిత్యాల ప్రభావం ఎంతైనా ఉన్నదని వక్కాణించారు.
సత్యభామగారు రమానాధ్ కందాళగారి హాస్యశీర్షిక 'నారిగాడి సోది" నుండి రేడియో పాటల సోదిని ఇజీనగరం యాసలో మాబాగా సదివి ఇన్పించేసినారు, కడుపుబ్బా నవ్వించిన ఈ అంశంలో సత్యగారి చదివిన తీరు పెద్ద హైలైట్!!  

హాస్యసాహిత్యం కేవలం కాలక్షేపపు నవ్వులకి పరిమితం కాకుండా దురాచారాలను, సమాజపు లోటు, పాట్లను ఎత్తి చూపి ప్రజల్లో చైతన్యం తేవడంలో కీలకపాత్ర వహించిందని చర్చలో పాల్గొన్న సాహితీ ప్రియులు తెలియజేసారు, అదే చర్చలో నాటి నుండి నేటి వరకు హాస్యానికి ఊతనిచ్చిన పలువురు గొప్ప రచయితలని - గురజాడ, మొక్కపాటి, చిలకమర్తి, ఆదివిష్ణు, యెర్రంశెట్టి శాయి, వంగూరి - ప్రస్తావించడం  జరిగింది. 

కొత్తగా మొదలుపెట్టిన పుస్తక సమీక్ష విభాగంలో తొలిసారిగా "భారతీయ  సాహిత్యం - సమకాలీన కథానికలు" అన్న పుస్తకాన్ని మధు పెమ్మరాజు గారు ఎంతో నేర్పుగా సమీక్షించారు. పుస్తకంలో చోటు చేసుకున్న రచయితలనీ, వారి కథానికలను తెలుగులోకి అనువదించిన అనువాదకులనీ ముందుగా పరిచయం చేసి, తరువాత అనువాదాల సరళిని గురించి మాట్లాడారు. తరువాత ఆయన తన మనసుని కదిలించిన కొన్ని కథానికలను క్లుప్తంగా వివరించి, సమీక్షని పూర్తి చేశారు. సమీక్ష మొత్తం ఉద్వేగభరితంగాను, ఆలోచనలను రేకెత్తించే విధంగాను సాగింది. సమీక్ష చివర్లో సభాసదులు ప్రశ్నలు అడగటం, మధు గారు సమాధానాలు ఇవ్వటంతో ఈ విభాగం ఇంటరాక్టివ్ గా ముగిసింది.
 
స్వీయ రచనల విభాగంలో ఉమా పోచంపల్లి గారి దంత వైద్యపు అవస్థ విని అయ్యో అనాలో, మీ రచన బాగుందనాలో తెలియక తికమకపడితే, సత్యదేవ్ గారి 'బుచ్చమ్మ అష్టావధానం అను గిరీశం లెక్చరు తాజా హాస్యాన్ని పన్నీటి జల్లులా చిలకరించి, అయ్యో అప్పుడే అయిపోయిందా అనిపించారు. చివరగా సత్యభామగారి బోనస్ అంశం "శ్రీ ఏసుక్రీస్తుడు" చదివి వినిపించారు. భక్తిని, అక్కర్లేని రక్తిని మేళవించిన శ్రీరామదాసు, అన్నమయ్యలాంటి చిత్రాలపై అనిల్ గారి వ్యంగ్య బ్లాగుతో నవ్వులతో కార్యక్రమం ముగిసింది.

సత్యదేవ్ గారు లేఖకులుగా, సుధేష్ గారు గ్రాహకులుగా, శాయిగారి పకోడీ దాతగా వ్యవహరించారు. నిండు వెన్నెలగా సాగిన జనవరి సభ ఈ ఏడాది రాబోయే వేడుకలకి శుభారంభం తెలిపింది.  

1 comment: