Maruwada Rajeswarao Kadhalu - Oka Sameeksha

మరువాడ రాజేశ్వరరావు కథలు
ఒక సమీక్ష
By Sai Rachakonda, Houston, TX - USA

మూడు నాలుగు నెలల క్రితం రాజు గారు మరువాడ రాజేశ్వరరావు గారి పుస్తకం ఇచ్చినప్పుడు అనుకోలేదు ఆ కథలను ఆయన సమక్షం లోనే సమీక్షించే రోజు వస్తుందని.  అడపా దడపా అక్కడ అక్కడ చదువుతూ అనుభవిస్తూ ఉంటుంటే, ఒక రోజు, మరువాడ వారిని పిలుస్తున్నామని, మరునాడు, నువ్వు సమీక్షిస్తావా అని అడిగినట్టే అడిగి ఆర్డరు వేసేసారు రాజు గారు.   అది ఒక చక్కని అవకాశమని ఇప్పుడు తెలుస్తోంది. 

కథలు రచయిత ఏ భావంతో రాసినా, చదువరి హక్కేమిటంటే తన రంగుటద్దాల్లోంచి  చూస్తూ, తన భావాలకి తగ్గట్లుగా ఆ కథని అన్వయించుకోవడం.  ఇవి నా రంగుటద్దాలు .  

ఈ పుస్తకంలో ఇరవై కథలున్నాయి.  నిజానికి అన్నీ చిన్న కథలే.  రెండు పేజీలనించి ఐదారు పేజీల వరకు.   కథా వస్తువులన్నీ మనకు పరిచయమే, మనం పట్టించుకోని వస్తువులే!  గోడలు, జెండాలు, గీతలు , కలలు, వీటన్నిటిని, మనం చూడని తనదైన భావంతో చూసి రాసిన కథలివి.   అతి సాధారణ మయిన కథా వస్తువులలో అత్యంత అర్థాన్ని చూపించారు రచయిత ప్రతి కథ లోను.  అన్ని వస్తువులు, ఆయనకు సమాజంలో జరుగుతున్న అన్యాయాలకి ప్రతి రూపాలు.  ధన వంతులు, రాజకీయ నాయకులూ, బలవంతులు, బీద ప్రజల్ని, సామాన్యులని, బలహీనుల్ని నిర్దాక్షిణ్యంగా అణచి వేస్తున్నప్పుడు చూడ లేక రచయితగా తన యువత లోని ఆవేశాన్ని, కోపాన్ని వ్యక్తం చేస్తూ, ఒక విప్లవం వస్తుందని నమ్ముతూ, రాసిన కథలివి.  కులం, ధనం ప్రాతిపదికగా ఉన్న వర్గ వైషమ్యాలని ఆయన అంగీకరించ లేదు.  నలభై ఏళ్ళ క్రితం రాసిన ఈ కథల్లో, మనకు స్వాతంత్ర్యం వచ్చి 'ఏం  సాధించాము?' అనే ప్రశ్న కనిపిస్తుంది.  ఇంకొక విషయమేమిటంటే, ఈ కథలు ఏ ఆడియన్సు కోసమో రాసినట్లుగా అనిపించవు.  తనలో ఉన్న సంఘర్షణే ఈ కథల రూపం పొందిందని స్పష్టంగా తెలుస్తుంది.  కొన్ని కథలు చదువుతుంటే మా మెడికో శ్యాం రాసిన కథలని గుర్తుకు తెచ్చాయి. 

యాభై, అరవై, డెబ్భై లలో వచ్చిన సాహిత్యం లో ఒక తెలీని మధన ఉంది.  సమాజాన్ని మార్చాలనే తపన ఉంది.  స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలు కాబట్టి అందరం ఏదో చెయ్యాలనే ఉత్సుకత ఉంది.  దోచుకునే తెల్ల దొరల మీద నుంచి ఇంకా ఎక్కువ గా దోచుకునే నల్లదొరల మీదకి మరలింది సాహిత్యం దృష్టి.  ఆర్ధిక అసమానతలు, కుల మత వర్గ విబేధాలు, పురోగమించడానికి శూన్యమయిన  అవకాశాలు, సమస్యలు తీరడానికి విప్లవాలు రావాలనే ఆశ, నిరుద్యోగం, క్షణ క్షణం కనిపించే జీవన సంఘర్షణ లోంచి పుట్టిన యువ ఆవేశాలు, ఆవేదనలు, రచయితలకి, కవులకి, వారి భావావేశాలకి ములాధారాలయాయి.  అట్లాంటి వ్యవస్థ లోంచి విలువ కట్ట లేని సాహిత్యం వచ్చింది.  మరువాడ వారి కథలు ఆకోవ లోకి చెందినవి. 

గోడ కథలో ఒక ముసలి అవ్వ పేడతో పిడకలు చేసి, ఓ గోడ మీద  ఎండ బెట్టు కుని, అవి అమ్మి వచ్చే పైసలతో కడుపు నింపుకుంటుంటే, ఆ గోడని ఎలెక్షన్ల పోస్టర్లు అతికించడానికి, కంపెనీల ఎడ్వర్టైజ్మెంట్లు వేయడానికి మార్చినప్పుడు జీవనాధారం పోయిన ఆ ముసలి పడే ఆవేదనే 'గోడ' కథ.  చివరలో రచయిత 'అ గోడ స్వతంత్ర భారత దేశం లాగుంది' అన్నప్పుడు గుండె కలుక్కు మంటుంది. చదువరిలో బాధ, కొంత గిల్టీ ఫీలింగ్సు, తప్పవు

జెండా కథలో ఓడ కళాసి కొడుకు గురవడికి జెండా కావాలి.  జెండా అంటే స్వతంత్ర మట!  పదిహేను పైసలది.  కాని, ఆపైసలేవి?  ఎవరో పారేసిన, లేక పారేసుకున్న జెండా దొరికినప్పుడు 'స్వతంత్రం వచ్చిన రోజు ప్రతి పేదవాడు, మురిసి పోయినట్టే' వాడూ మురిసిపోయాడు.  అందరిలాగే తను ఆ జెండాని తగిలించుకుందామని అనుకునేటప్పుడు కాని తెలీలేదు 'జెండాలు చొక్కాలున్న వాళ్ళకేగాని, చొక్కాల్లేని వాళ్ళకోసం కాదన్న' సంగతిస్వతంత్రం వచ్చింది ఎవరికీ? పాములు బుస కొడుతున్నట్లు న్న గొంతుతో ఉపన్యసిస్తున్న మంత్రి గారికా?  మోసం చేసి ఓ ఆడ పిల్లని తీసుకొచ్చి తాగుతూ బలాత్కారం చేసిన మంత్రి గారి పెద్దల్లుడికా?  చొక్కాలు లేని గురవడి లాంటి బీద ప్రజానీకానికా?  చిన్నజెండాలో పెద్ద ప్రశ్నలు?  సమాధానం తెలిసే తెలీని ప్రశ్నలు! 

చదువుఉద్యోగార్హత ఉన్నా, ఉద్యోగం కొనుక్కోగలిగే డబ్బు లేక పోయినా, పెద్ద పెద్ద సిఫారసులు లేక పోయినా, మామూలు ఉద్యోగం రాక పోగా, కనీసం కాయకష్టం కుడా చేసే శరీరం,శక్తి, మధ్య తరగతి మనుష్యులకు ఉండదని చెప్తారు 'ఏమవుతావు' అన్న కథలో! 

పట్టుమని మూడు పేజిలయినా లేని కథలు కావలసినన్ని ఉన్నాయి ఈ పుస్తకంలో.  'టికెట్ లెస్' అన్న కథలో టికెట్ తీసుకోని ప్రయాణికుడికి, టికెట్ కలెక్ట రుకీ మధ్య జరిగే సంభాషణ సరదాగా ఉంటుంది. 'టికెట్ కొనుక్కోలేని వాడికి డెమోక్రసీ లోనూ జైలే, డిక్టేటర్ షిప్ లోనూ జైలే, జైలుకి పంపించడం తప్పించి మీరెవ్వరూ ఏమి చెయ్యలేరు. అయినా నా ప్రయాణం మానను',   అంటూ సీటు మీద మఠం వేసుక్కూర్చున్నాడు టికెట్ లెస్..'  అంటూ ముగిస్తారాకథని.  ఇందులో సోషలిజం కోసం వెతుక్కోవచ్చు, మొండికేసిన వాడితో ఒక ఆఫీసరు పడే అవస్థలు చూడొచ్చు.

సంధ్యా రాగం కథలో సోషలిజం లాంటి ఒక ఐడియల్ వ్యవస్థలో స్వేచ్ఛ ఉండచ్చేమోనని అంటూనే, ఎందులో ఉన్నది స్వేచ్ఛ అని ప్రశ్నిస్తారు రచయిత.  అట్లాగే 'హక్కు' అనే కథలో హక్కంటే ఏమిటో చర్చిస్తారు.  హక్కులు సాధించుకోడానికి, బ్రతుకులు బాగు పడ్డానికి ఏవీ సంబంధం లేనట్టుందని వాపోతారు.  'కూలి వాళ్ళ మీటింగులో మాట్లాడుతూ, కేవలం ప్రాణాలతో కాక, మనుషుల్లా బతికే హక్కు సాధించుకోండి' అని అనిపిస్తారు.  ఈ కథలో కుడా సామాన్యుడి హక్కు పోరాటంలోనించే సాధించ గలదని స్పష్టం చేస్తారు రచయిత.  

సభ్యతకి అసభ్యతకి మధ్య గీత ఎంత స్పష్టమైనదో ఎంత అస్పష్టమైనదో మనకి కనిపింప చేస్తారు రచయిత గీత కథలో.  తిండి లేక పోయినా మధ్య తరగతి మనుషులకి వదులుకోలేని అభిమానం, అర్థం తెలియని సంస్కారం తమ చుట్టూరా ఎన్ని గీతలని గీసి జీవితాలని పరిమితం చేస్తాయో!  పుట్టుకలోను, బతుకులోనే వున్న సంకెళ్ళు అధికారం, అజ్ఞానం విధించినవి.  'గీత చెరిగి పోవాలంటే, సంకెళ్ళు తెగి పోవాలి.  అన్ని సంకెళ్ళు...తెగిపోయి తీరాలి' అని చెప్పిస్తారు రచయిత. 
నాకు నచ్చిన మరో రెండు చిన్న కథానికలు కల, కులంగాడు.  

కల కథ చదువుతుంటే అది కలగా అనిపించలేదు.  అతి సామాన్యుడు జీవితంలో పరిగెడుతూ సమాజం లోని అన్యాయాలకి, అక్రమాలకి, బలైపోతూ, ఎదురు తిరుగుతూ, జీవించే ఒక వాస్తవంలా అనిపించింది.  అందుకే అన్నారేమో రచయిత చివరలో, 'వ్యక్తులకే కాదు, సమాజానిక్కుడా, కలలొస్తాయి.  కలలు కల్పనలుకావు.  వాస్తవమే నిద్రలో - 'కల' రూపు తీసుకుంటుంది! ....కల ఆగిపోయినా వాస్తవం ఆగదు ...' అని.  

'కులం గాడు' మన అందరిలోనూ ఉన్నాడు.  కులం గాడి తో పాటు, జాతి గాడు, వర్గం గాడు, మతం గాడు, భాష గాడు, అందరూ మనందరిలో ఉన్నారు.   ఎక్కడికి పోతారు?  మనం పుట్టినప్పుడే మనకి ఒక ఐడెంటిటి వచ్చింది.  అది లేకపోతె మనకి మనుగడ లేదా? అని ప్రశ్నిస్తారు రచయిత.  కులాన్నిజాతిని, మతాన్ని, ప్రాతిపదికగా తీసుకునే బదులు, నీతిని, నియమాన్ని, ధర్మాన్ని, గుండెల్లో దాచుకుంటేనో?  అప్పుడు, 'చెట్ల మీద శుభం  పువ్వులు పూస్తాయి, క్షేమం కాయలు కాస్తాయి, హర్షం నదులు ప్రవహిస్తాయి' అన్న ఆశ వ్యక్తం చేస్తారు రచయిత.  "ఏరా? పగటి కలలు కంటున్నావా?"  అని కులం గాడు అడగడం జీవితంలో మనం ఎంత వరకు ఐడియల్స్ అమలు పరచ గలము అని మనకే ప్రశ్న అన్నమాట.  

సూక్ష్మమయిన కథా వస్తువు, పదునైన భావం, మరువాడ వారి  సొత్తులు.  చదివిన తరువాత మన ఆలోచనలలో అయన కథలు కొంత సేపటి వరకు, పచార్లు చేస్తూనే ఉంటాయి. అన్ని కథలు ఏవో ఒక సందేశాన్నిస్తూనే ఉంటాయి.  బలవంతులు బలహీనుల్ని పీడించుకు తినే సంఘంలో ఒక విప్లవం వస్తుందని, బలహీనులు బలవంతులకి ఎదురు తిరిగి నిలవగలరని, అప్పటి మరువాడ వారి ధృఢ నమ్మకం అనిపిస్తుంది ఈ కథలు చదివాక

ఆయన విరసానికి సంబంధించిన వాడే గాని, సరసానికి మాత్రం కాదని కుడా అనిపిస్తుంది.  

మరువాడ రాజేశ్వరరావు గారి కథలు మరువ లేనివి.  చదవండి.  

శాయి రాచకొండ
07-Jan-2011


No comments:

Post a Comment