అమెరికాలో అర్థనారీశ్వరులు - మధు పెమ్మరాజు

ఇక్కడి మగాళ్లంటే  అందరికి లోకువే -  ఇండియా నించి వచ్చిన అమ్మకి, ఇంట్లో పిల్లాడికి, పెళ్ళానికి, ఆఫీసులో  కుళ్ళు జోకులు వేసే మనేజేరుకి…అప్పట్లో మిస్టర్ పెళ్ళాం అంటే వింత, ఇప్పుడు దిన దినపు రోత, కోత.  రోజూ రకరకాల పాత్రలు పోషించక తప్పదు - మంచి (డ్రైవర్, విధూషకుడు, పనివాడు, ప్రోగ్రామర్, భర్త.. ఇలా ఇంకో  వంద).  


పెళ్లి  (పెంపకం  అనడం  బెటర్) అయ్యాక  కొందరు  బెస్ట్  హాఫ్ తో  “ అది  కాదురా! ఇంకో  రెండు  చెంచాలు  తిను”, “జాగ్రత్తరా ! అసలే కార్పెట్టు , కాళ్ళు  కందిపోతాయ్”, “ఆఫీసుకి  వెళ్ళాక  బోర్  కొడితే, ఓ నాలుగ్గంటలు ఇండియా  మాట్టాడు, రెండు గంటలు చాట్, ఫేస్బుక్ ఊదేయ్, ఈ  లోపల  నేను  వాలిపోతా” అంటూ  ముద్దుచేసి  'సన్న'జాజి ని కాస్తా “బొండు”మల్లిని చేసి కొన్నేళ్ళకి  “కుక్కర్ పెట్టి, చెత్త పడేసి, వస్తూ  వస్తూ  కూరగాయలు, వచ్చాక  బ్యూటీ  పార్లోర్ ”అనే  దాక  తెచ్చుకుంటారు.

మొన్నెవరో ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ వాళ్ళావిడ బేబీ షవరు అంటూ ఆయాసపడుతుంటే అనాలనిపించింది "అయితే నీకేమిటి హడావిడని?", నోరు జారితే వెనక్కి తీసుకోలేం కదా?, మళ్లీ అందరికి చెప్తాడని  లోపలే అనుకున్నా,  అసలే  ఇక్కడి   తెలుగు  మగాళ్ళ  నోట్లో  నువ్వు  గింజ  కూడా  నానదు.   బేబీ షవరు అంటూ ఓ రెండు  వారాలు కంగారు పడ్డాడువాడు, జాలనిపించింది. ఎంత ఇంగ్లీష్ పేరు పెడితే మాత్రం సీమంతం మగ  పేరంటం  అవుతుందా?, ఇదే మా బామ్మ అయితే  ఓ నాలుగు మాటలు అనేసేది, ఆవిడకేం తెలుసు ఇవి   దిబ్బ  రొట్లు , రోట్లో పచ్చళ్ళు, కుంకుడికాయల  రోజులు కావు, తోలు పీజ్జాలూ, కొయ్య బర్గెర్ల రోజులని.  కానీ ఏం చేస్తాం? ఖర్మ! రిబ్బన్లు, బలూన్స్ కడుతూ అనిపించింది ఆడ దిక్కు లేని బ్రతుకులు అని, అసలే  హైబ్రిడ్   రోజులు  కదా, ఈ ప్రహాసాన్ని 'సీమ  షవర్'  అనుకుందాం. పోనీ  అక్కడైనా  తిన్నగా ఉంటారా ఈ  అర్థ  నారీశ్వరులు  అంటే  అదీ  లేదు. తలుప్పకన దాక్కుని, ఆ  నిండు గర్భిణి  భారంగా,  తిట్టుకుంటూ లోపలకి  రాగానే అమాంతం "సర్ప్రయ్స్" అని  గావు  కేకేస్తారు, భయంతో  ఆవిడ  అక్కడే   ప్రసవిన్చేస్తున్దేమోనని  కొందరు కుర్చ్చినో, పక్క వాడి   భుజాన్నో  నొక్కేస్తుంటారు, ఆ  నొక్కిన్చుకున్నవాడు  ఎవ్వరికి  అర్థం కాకుండా  కెవ్వులో  వంత  కలుపుతాడు. ఇక  పార్టీ  మొదలయ్యకా విచిత్ర  వేష ధారణ  - ఓ ఇద్దరు పొట్టి చొక్కాలతో ఏభై లో ఇరవై ఏళ్ళ గెట్టప్పులు, ఇంకో ముగ్గురు ఇక్కడా మేము పోటీనే అనే బాన పొట్టలు, గర్భిణి తో పోటీగా భుక్తాయాసాలు, చివరగా  పెళ్లి రిసెప్షన్లాగ మేము నిజంగానే వచ్చాం అనే ఫ్యామిలీ ఫొటోస్, ఫోటో తియ్యకుండానే ఎలా పడ్డానో అనుకునే  భార్యలు, పక్కన శాంతమూర్తిలాగ  పిల్లాణ్ణి ఎత్తుకున్న భర్తలు -కార్యక్రమాన్ని జయప్రదం చేసారు.

పిల్లలతో మరీ  కనికష్టం, "నాన్నా నీకు ఇంగ్లీష్లో ఒక్క ముక్కా రాదు" అని ఇంగ్లీష్ లో  అరిపించుకున్నపుడు అనాలనిపిస్తుంది "మేము చదివిన కాన్వెంట్ చదువులు చంక నాకినట్టేనా", "రోజూ ఆఫీసులో గాడిదలు కాస్తున్నామా అని" అష్ట  వంకర్లు  తిరిగి మాట్లాడితే కాని ఇంగ్లీష్ కాదు వీళ్ళకి , పైకి   మాత్రం మాది బ్రిటిష్ ఇంగ్లీష్, ఇండియా ఇంగ్లీష్, బొబ్బర్లంక  ఇంగ్లీష్....తోటకూర అని… వెర్రి మాటలు. అదృష్టం చూడండి వాళ్ళు  ఫ్రీగా ఏదైనా అనేయొచ్చు, కాని మనం  చెప్పేవి వాళ్ళకి అర్థం కావు..అందుకేనేమో చిన్నార్లకి చీకు చింతా  ఉండవు అంటారు. అదే మా నాన్నైతే ఓ  నాలుగు తగిలించే వారు బాగా అర్థం అయ్యి ఇంకో ఇరవై ఏళ్ళు గుర్తుండేలా, కొందరి పరిస్థితి ఇంకా ఘోరం- పిల్లలు మీద చాడీలు మొదలెడితే, TV9 లో అత్తా-కోడళ్ళ ఆగడాల వార్తల్లా  ఉంటాయి - అవమానం, అపార్థం, అభిప్రాయ భేదం, అ తో మొదలయ్యేవన్నీ, .. వాళ్ళ  నాలుగేళ్ళ అబ్బాయి, నలభై ఏళ్ళ నిరుద్యోగిలా దుంప తెన్చేస్తున్నాడని ఒకటే గొడవ, కన్నీరు, మున్నీరుగా  సెల్ లో మినిట్స్ వాడేసాడు, నా గోడు చేబ్దామనుకుంటే మినిట్స్ లేవని ఫోన్ పెట్టేసాడు… ఇదొక 'భావ దోపిడీ' వాళ్ళ  ఏడుపు ఏడవొచ్చు, మనకి అవకాశం ఇవ్వరు

ఇక అలాగే పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని, డాలర్లు లేక్కెట్టుక్కొని, డీల్స్ వెతుక్కొని ఇనేళ్ళా, ఇంకా ఎన్నేళ్లో ఈ  త్రిశంకు నరకంలో అనుకుంటుంటే, ఈ మధ్యన ఓ ఫ్రెండ్ వెధవ నా సోదిని, శోషని   భరించలేక “తిరిగి  వెళ్ళిపో ఇండియా” అన్నాడు, అది సలహానో, నన్ను తప్పిన్చుకోవడమో తెలిదు కాని, వెనక్కి తిరిగి వెళ్దామంటే అక్కడ మనకోసం చంద్రగ్రహం నించి అర్ముస్త్ర్రాంగ్  దిగాడు  అని  దండలు ఎవ్వడూ  వెయ్యడు. పైపెచ్చు కవ్న్  కిస్కా గొట్టంగాడు వచ్చాడు వీడితో కలిసి ఈ సంవత్సరం వెనక్కి దాపరించినవాళ్లు కోటిమంది అని లెక్క  తేగేస్త్తారు. సరదాగా వానేజ్ ఫోన్ కదా అని ఆదివారం ఇంకేవడికో  నెంబర్ కలిపి విన్నవాడికి సెన్సేషన్ గా  ఉంటుందని  "ఇండియా వచ్చేద్దమనుకుంటున్నారా " అంటే,  వాళ్ళూ  తెలివి మీరి పోయారు మనకి తెలీని విషయంలా  "అమెరికాలో క్వాలిటీ అఫ్ లైఫ్ చాలా బావుంటుంది తిరిగి  రాకు" అన్నాడు, కాని లోపల ఇప్పటికే చస్తున్నాం, ఈ వెధవ కూడా వస్తే పోటి పెరుగుతుందని అర్థం. ఏది చెప్పినా,  విన్నా ప్రతి మాటకి పది అర్థాలు వస్తాయి, మధ్య/సగం/అర్థ లో ఉండే వాడి పాట్లేమో- వయస్సు, తరగతి., జుట్టు, నారీశ్వరుడు వగైరా వగైరా..

అసలు మగాళ్లంటే చిన్నపుడు మా నాన్న, కాలనీ లో అంకుల్స్ - వాళ్ళ టీవీఎస్, లూనా చప్పుళ్ళు మైలు దూరంలో  వినగానే పిల్లలు ఎండాకాలంలో కూడా వణికి, హడలి,  గోడలు దూకి, చెట్లు దిగి, ఎలకలు కన్నాల్లోకి  జేరినట్టు ఇంట్లోకి వెళ్లి పుస్తకాలు పట్టుకొని ఆస్కార్ నటన  మొదలెట్టేవారు,  వాళ్ళు నాన్నలు  రాగానే చాలా కోపంగా టీ తాగి, లుంగీలు కట్టుకొని రోడ్డు పై రాజకీయాలు, రష్యా,రాకెట్లు, ఇంక్రేమెంట్లు అని ఓ రెండు గంటలు భూప్రదక్షిణం చేసి, తిరిగి వచ్చామో లేదో చుట్టూ చూసుకొని, ఆకలేయ్యగానే ఇంటికెళ్ళి పోపు సరిగ్గా లేదని ఓ నాలుగు అరుపులు అరచి, ఇంకా కోపం తగ్గక పోతే మూల  చదువుతున్నట్టు నటిస్తున్న పిల్లాణ్ణి ఓ రెండు బాదుళ్ళు బాది, హాయిగా పడుకునేవారు. అదీ  మగాడు అంటే,  మగాడు అంటే మీసం ఉండాలి, రోషం ఉండాలి, లుంగీ కట్టాలి. ఇక్కడి ముప్పావు నారీశ్వరులు అనడం మెరుగు,  తలుచుకుంటేనే గుండె చేరువైపోతోంది , నిక్కర్లు వేసుకొని, పేడి మొహాలతో,  కోపం అంటే పాపం లాగ, పోలో వేసుకున్న గంగిరెద్దులా తయారయ్యారు, ఏమన్నా ఇకిలిస్తూ, దులిపేసుకుంటూ, అన్నీ వదిలేసి.. స్థితప్రజ్ఞుల్లాగ అన్నమాట.

ఈ మధ్యనే ఇండియా నించి మొదటి సారి వచ్చిన ఆంటీ, "ఏమిటండి వీళ్ళ  ఖర్మ, అంట్లు తోముతూ, ఇల్లు తుడుచుకుంటూ, దొడ్లు కడుకుంట్టూ " అని వాళ్ళ అబ్బాయి గురించి తెగ బాధ పడుతూ ఉంటె, పక్కింటి ఆంటీ కొద్దిగా సీనియర్ అంటే, ఆవిడ  నాలుగు సార్లు వచ్చారు అమెరికా, ఇక్కడ  అంతేనండి, ఎవరి  పన్లు  వాళ్ళే  చేసుకోవాలి , ఆడ  మగ  తేడా  ఉండదు" అన్నారు సాగతీసుకొంటూ,  మొదటి ఆంటీకి ఆనందం కలిగి, కొడుకు పై బాధ కూడా మర్చిపోయారు,  ఎందుకంటే ఇండియా వెళ్ళగానే   చుట్టూ వున్న వాళ్ళ చెవులు కొరకడానికి బోలెడు విషయాలు దొరికాయని, ఇక  టీవీ లో  సీరియల్స్ ఆగినా  ఆవిడ ఇక బాధ పడరు..

ఈ త్రిశంకు నరకం గురించి చెప్పి దీంట్లోంచి బయట పడే మార్గం చెప్పమని ఇంకో సీనియర్ని శరణు వెడితే,   వాడికి  చమత్కారంతో పాటు చావు తెలివి తేటలు ఎక్కువే, "ఏరా గ్రీన్ కార్డు వచ్చి ఆరేళ్ళు అయ్యింది కదా సిటిజెన్ అయిపోవచ్చు కదా" అన్నాడు. అడిగింది ఏమిటి, వాడు  చెప్తోంది ఏమిటి అనిపించినా తెలియని విషయాలు తెలుస్కోవడం మంచిదని అమాయకంగా “ఎందుకూ?”  అని అడిగా, అవతల వాడికి తెలీదు అనగానే, ఎక్కడలేని మోటివేషన్ వచ్చేస్తుంది, వెంటనే వాడు" ఆ  మొక్కుబడి అవ్వగానే ఇండియా వెళ్ళొచ్చు"అన్నాడు అప్పుడు అర్థం అయ్యింది మొదటిసారి వేల్లిపోవ్వచ్చు  అని ఎందుకు అన్నాడో, సరే ఇందులో ఏదో గూడార్ధం ఉందని, వీడితో కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలని ఇంకా  వెర్రి వాడిలా మొహం  పెట్టి "ఇండియా వెళ్ళడానికి ఇక్కడ సిటిజెన్షిప్ ఎందుకురా" అనగానే  వాడు "ఒరేయ్  సన్నాసీ ఏదైనా  తేడా వస్తే ఇక్కడకి వచ్చేయొచ్చు కదరా"అన్నాడు,- ఇదేదో పుట్టిల్లు లాగా.  పైకి ఇది తప్పు, అది ఒప్పు అని  ధర్మరాజులా  నటించినా  లోపల ఇదేదో  బావుందనిపించింది, వాడేళ్ళగానే  కంప్యూటర్లోకి  లాగిన్  అయ్యా, గూగుల్  పేజి  తెరిచా, వీడు  చెప్పింది నిజమేనా ఏవైనా  లొసుగులు  ఉన్నాయా అని  , “గూగుల్  ఉంటె  వేరే  బ్రతుకెందుకు"…….స్నేహంలో  పాట పాడుకుంటూ...సైబర్ లోఫింగ్ (గాలి తిరుగుడు ) మొదలెట్టా. 

Disclaimer- ఈ బ్లాగ్ ఖచ్చితంగా ఎవ్వరినీ ఉద్దేశించి రాయలేదు. ఎందుకంటే ఇది రాసినవారిదీ పేడి మొహం, ఆయన నిక్కర్లు, పోలోలు వేసుకుంటారు..వగైరా వగైరా కాబట్టి, అయినా నమ్మకపొతే మీ ఖర్మ!

No comments:

Post a Comment