48వ నెల నెలా తెలుగు వెన్నెల - సమీక్ష

హ్యూస్టన్ నగరం, శనివారం, మే 3, 2014

ముఖ్య అతిథి - ఆచార్య వేము భీమశంకరం గారు

హ్యూస్టన్ సాహితీలోకం నిర్వహించిన 48 "నెల నెలా తెలుగు వెన్నెల" కార్యక్రమం మే 3 తేదీన షుగర్లాండ్ గ్రంథాలయంలో ఎంతో చక్కగా జరిగింది. దాదాపు 35 మంది ప్రేక్షకులు విచ్చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథి డా. వేము భీమశంకరంగారు గారు.

"వెన్నెల"లోని ప్రథమాంశమైన పుస్తక సమీక్షలో డా. వంగూరి చిట్టెన్ రాజు గారు ఒక వచనకవితా సంకలనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసారు. "బాటే... బ్రతుకంతా" అన్న పుస్తక రచయిత శ్రీ అవధానుల మణిబాబుగారు. 23 కవితలు గల గ్రంథానికి ప్రముఖ ప్రవచనకర్త సామవేదం షణ్ముఖశర్మగారు ముందుమాట వ్రాసారు. చిట్టెన్ రాజుగారు తమదైన శైలిలో కవితలను విమర్శిస్తూ విధంగా సమీక్షించారు:
“కవి చెప్పదల్చుకున్న విషయం లో స్పష్టత ఉంది, పద ప్రయోగాలు బావున్నాయి. ఇంకా తన బాణీ (గొంతుక) వెతుక్కుంటున్న లక్షణాలు ఉన్నాయి. సరి అయిన “స్ఫూర్తి “ కలిగితే కవిగా స్పందించే పోకడలు ఉన్నాయి. మంచి కవి కి కావలసిన భాషా పరిజ్జానం, సమాజ అవగాహన, సహృదయ స్పందన, తపన, ఎన్నుకునే వస్తువుపై అవగాహన మొదలైన కొన్ని లక్షణాలు  ఉన్నాయి.”

పుస్తకంలోని రెండు కవితలను చదివి వినిపించారు చిట్టెన్ రాజుగారు. ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని పొలంలో పనిచేసే రైతుతో ఎంతో చక్కగా పోలుస్తూ వ్రాసిన "ముద్ర" అనే కవిత అందరినీ ఆకట్టుకుంది.

భారతదేశం నుండి వచ్చిన ముఖ్య అతిథి డా. వేము భీమశంకరం గారిని పరిచయం చేస్తూ శాయి రాచకొండ గారు యాభయ్యేళ్ళ క్రిందట తమకు భీమశంకరంగారితో వున్న పరిచయాన్ని సభకు విన్నవిస్తూ వారిని వేదిక మీదికి ఆహ్వానించారు.
భీమశంకరంగారు మాట్లాడుతూ, తమకు చిన్నప్పుడు సాహిత్య రంగంలో ఏమాత్రం ప్రవేశం లేదనీ, అరవయ్యేళ్ళ వయస్సు దాటేవరకూ, అనగా భూ-భౌతిక శాస్త్రజ్ఞుడిగా, విద్యావేత్తగా పదవీ విరమణ చేసేవరకూ సాహిత్యం జోలికి పోలేదన్నారు. తరువాత సమయాన్ని వృథా చేయకుండా రచనా వ్యాసంగం వేపు మనసు మళ్ళిందని అన్నారు.
తమ ప్రసంగానికి ఆరంభంలో తాము రచించిన "తెలుగు వైభవం"నుండి రాగయుక్తంగా పాడిన సీ.డీ.లోంచి కొన్ని పద్యాలను వినిపించారు. పలు పద్యకవితా గ్రంథాలు రచించిన భీమశంకరంగారు దాదాపు అన్నింటినీ సభకు పరిచయం చేసి వాటిలోని కొన్ని పద్యాలను, సందర్భాలను, వాటి వెనక నేపథ్యాన్నీ పేర్కొన్నారు.
ఛందోబద్ధమైన పద్యాలంటే తమకు ఎంతో మక్కువ ఉందని, ఇతర కవితా ప్రక్రియల కంటే పద్యాలపైనే పక్షపాతం కూడా వున్నదని అంగీకరించారు. ఛందస్సులో ఎంతో అమరిక వున్నదని, సంస్కృత వృత్తాలలైనా, తెలుగువైనా వాటిలోని గణాల కూర్పనేది గణితశాస్త్ర నిబద్ధంగా ఉంటుందనీ వివరించినప్పుడు భీమశంకరంగారి లోని శాస్త్రజ్ఞుడి దృక్పథం వెలువడింది.

తమ ఇంటిపేరు "వేమూరి" నుండి "వేము"గా ఎలా మారిందో వివరిస్తూ, వేము వంశవృక్షం పై కొంత పరిశొధన చేసి, తమ పూర్వీకులకు సంబంధించిన కథాంశాలను వస్తువుగా ఎన్నుకొని వ్రాసిన "రసస్రువు" గ్రంథంలో నుండి కొన్ని పద్యాలు చదివి వినిపించారు. స్వతహాగా ఉపాధ్యాయ వృత్తిలో కొన్ని దశాబ్దాలు పని చేసిన భీమశంకరం గారు పద్యాల వెనుకనున్న కథను, పద్యాల విశ్లేషణను ఎంతో ఆసక్తికరంగా ప్రసంగించారు. కొన్ని శతాబ్దాల నాటి ఆంధ్రదేశంలోని సాంఘిక పరిస్థితిని తమ కథల్లో చూపుతూ, కథలలోనే కొన్ని చారిత్రక సంఘటనలను, కొంత కల్పనను, అక్కడక్కడ అతిశయోక్తిని కూడా వాడి రచించిన పద్యకావమది.
పుస్తకంలోని కథకు సంబంధించిన పద్యాలతో పాటు తాము పద్యనిర్మాణంలో చేసిన కొన్ని ప్రయోగాలను కూడా పరిచయం చేశారు. చతుర్విధ కందము (ఒకే కంద పద్యంలో నాలుగు కందపద్యాలు ఇమిడి వుండడం), సీసపద్యంలో మత్తేభ కంద పద్యాలు దాగి వుండడం మొదలైనవి ఎన్నో ప్రయోగాలు చేసిన భీమశంకరం గారు వాటిలో కొన్నిటిని చదివి వినిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

భీమశంకరం గారి మరొక రచన పేరు "శ్రీరామ! నీ నామమేమి రుచిర!". అపరాధ పరిశోధన కథా వస్తువుగా గల పుస్తకం కూడా ఆద్యంతమూ చక్కటి పద్యాలతో సమకూర్చబడినది. ఇటువంటి సాంఘిక డిటెక్టివ్ ఇతివృత్తం గల పద్యకావ్యం ఎంతో అరుదు. కథను ప్రేక్షకులకు చెబుతూ గ్రంథంలోని పద్యాలను వినిపించి, గ్రంథం యొక్క నామౌచిత్యాన్ని కూడా వివరించారు.
దక్షారామ భీమేశ్వర శతకం, శివానంద మందహాసం మొదలుగా మరికొన్ని రచనలను క్లుప్తంగా పరిచయం చేసి తమ ప్రసంగాన్ని పూర్తి చేసారు భీమశంకరం గారు.

"అప్పుడే అయిపోయిందా!?" అనిపించేట్టు భాషించిన ఆచార్య వేము భీమశంకరంగారి ప్రసంగం పూర్తయిన తరువాత స్థానిక తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు మారుతి రెడ్డి గారు, పల్లవిగారు, చిట్టెన్ రాజు గారు భీమశంకరం గారిని సత్కరించారు. భీమశంకరంగారి ప్రసంగానికి స్పందిస్తూ మన "నెల నెలా తెలుగు వెన్నెల"లో పద్యకవిత ముఖ్యాంశంగా జరిగే కార్యక్రమాలు చాలా అరుదనీ, అద్భుతమైన ప్రసంగాన్ని వినే అదృష్టం కలిగిందనీ పలువురు ప్రేక్షకులు పేర్కొన్నారు.


టీ.సీ.. సమర్పించిన తేనీరు, పకోడీలతో కార్యక్రమం ముగిసింది.

47వ నెల నెలా తెలుగు వెన్నెల - సమీక్ష

హ్యూస్టన్ నగరం, శనివారం, ఏప్రిల్ 26, 2014

ఏప్రిల్ 26 కేటీలోని సింకో రాంచ్ గ్రంధాలయంలో 47 "నెల నెలా తెలుగు వెన్నెల" కార్యక్రమం జరుపుకున్నాము. కార్యక్రమాన్ని అనుకున్న సమయంకన్న కొద్దిగా ఆలస్యంగా ఆరంభించినా రసవత్తరమైన అంశాలతో ఎంతో తృప్తికరంగా జరిగింది. కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ చిలుకూరి సత్యదేవ్ గత నెలలో నగరంలో ఎంతో విజయవంతంగా నడిచిన టెక్సాస్ సాహిత్య సదస్సును జ్ఞాపకం చేసి, ప్రస్తుత సమావేశంలోని అంశాలను క్లుప్తంగా పేర్కొన్నారు.

నాటి మొట్టమొదటి అంశం "సామెతల అంతాక్షరి"ని పరిచయం చేస్తూ సామెతలు ప్రసంగాలకు క్రొత్త అందాన్నిస్తాయనీ, దాదాపు అన్ని భాషల్లోనూ సామెతలనేవి వుంటాయని చెప్పి కొన్ని ఉదాహరణలిచ్చారు సత్యదేవ్. అంతాక్షరి కార్యక్రమాన్ని సమన్వయకర్త రవి పొన్నపల్లి గారు చక్కగా నిర్వహించారు. విచ్చేసిన ప్రేక్షకులందరినీ రెండు జట్లుగా విభజించి, పలు ఆవృతాలు నడిపారు. అంతాక్షరి మాత్రమే కాకుండా "శంకర్ దాదా జిందాబాద్" అన్న శీర్షికతో సామెతలను ఆంగ్లంలోకి అనువదించి వాటికి మూలమైన తెలుగు సామెతలేమిటో చెప్పమని అడిగారు. కేవలం ప్రేక్షకులుగా మాత్రమే ఉండిపోకుండా గదిలోని ఇరవై మందీ ఉత్సాహంగా పాల్గొనే విధంగా నడిచింది ఈ పోటీ. ఈ ప్రక్రియ ద్వారా ఎన్నో క్రొత్త సామెతలు నేర్చుకునే అవకాశం కలిగింది.

తరువాత మధు పెమ్మరాజుగారు తమ బ్లాగునుండి "జిరాక్స్ కాపీ" అనే ఒక హాస్యభరితమైన అధ్యాయాన్ని చదివి అందరినీ కడుపుబ్బ నవ్వించారు. మనం రోజువారీ జీవితంలో ఎదుర్కునే పరిస్థితులను ఎంతో చమత్కారంగా వర్ణిస్తూ, అద్భుతమైన ఉపమానాలతో ఎంతో చక్కటి రచనను ప్రేక్షకులకు వినిపించారు.

"పుస్తక పరిచయం" శీర్షికలో రవి పొన్నపల్లి గారు "నడిచే దేవుడు" పుస్తకాన్ని సమీక్షించారు. కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరానంద సరస్వతి శంకరాచార్యులవారి గురించి నీలంరాజు వెంకటశేషయ్యగారు రచించిన గ్రంధంలో పరమాచార్యులతో రచయిత తమ అనుబంధానికి సంబంధించిన విషయాలే కాకుండా ఇతర భక్తుల అనుభవాలు కూడా వివరంగా రచించారు. భారతదేశ  స్వాతంత్ర్య పోరాటం సమయంలోనూ, దేశ రాజ్యాంగ రచన సమయంలోనూ డా. అంబేద్కర్ తదితరులతో పరమాచార్యులు జరిపిన చర్చల వివరాలు ఎంతో ఆసక్తికరమైన ఘట్టాలు.
కాకినాడ వాస్తవ్యులు, ప్రస్తుతం వారి కుమారుని వద్ద కొన్ని నెలలు గడపడానికి హ్యూస్టన్ నగరానికి వచ్చిన అయ్యగారి శ్రీరామమూర్తి గారు తెలుగు భాష యొక్క తీయదనంతో పాటు అందులోని వైవిధ్యాన్ని గురించి కూడా ప్రసంగించారు. వివిధ దైనందిన సంఘటనల్లో తెలుగు భాషను వేర్వేరు వ్యక్తులు ఎంత భిన్నంగా వాడతారో సోదాహరణంగా వివరించారు

ఇంత చక్కటి సాహిత్య సంబంధమైన కార్యక్రమానికి ముగ్ధులై, అప్పటికప్పుడు ప్రేరితులై శ్రీనివాస్ రాచపూడి గారు తమకు నచ్చిన శ్రీశ్రీ  కవితలను వినిపించారు. ఆ నేపథ్యంలో, 1980వ దశకంలో శ్రీశ్రీ అమెరికా దేశ పర్యటన చేస్తూ హ్యూస్టన్ నగరానికి వచ్చినప్పుడు వంగూరి చిట్టెన్ రాజుగారింట అతిథిగా ఉండి "సిప్రాలి" రచించిన సంఘటనను సభికులు జ్ఞాపకం చేసుకున్నారు.
తరువాత గోపాలకృష్ణ గూడపాటి గారు మే 3 తేదీన జరుగనున్న "మన బడి" సాంస్కృతిక కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించారు.

స్వీయరచనల విభాగంలో రవి పొన్నపల్లి గారు "అత్తారింటికి దారేది" సినిమాలోని ఒక పాటకు చక్కటి పారడీని రచించి రాగయుక్తంగా పాడి అందరినీ అలరించారు. చిలుకూరి సత్యదేవ్ గారు "మాతృదేవోభవ" అన్న కవితను చదివి వినిపించారు.

నెలవెన్నెల’కు పలువురు ప్రేక్షకులు మొదటిసారి రావడం, అందునా భారతదేశం నుండి మూడు నెలల క్రితమే ఉద్యోగరీత్యా హ్యూస్టన్ నగరానికి వచ్చిన పవన్ కుమార్ గారు సకుటుంబంగా వచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొనడమూ ఆనందదాయకమైన విషయం.

చిలుకూరి సత్యదేవ్ గారు మున్ముందు జరుగబోయే "వెన్నెల" కార్యక్రమాల వివరాలు చెబుతూ కార్యక్రమాన్ని ముగించారు.