నెల నెలా తెలుగు వెన్నెల - 03/22/2013 - శుక్రవారం 

శుక్రవారం, మార్చి 22న అష్టలక్ష్మి గుడిలో నెల నెలా తెలుగు వెన్నెల విజయవంతంగా జరిగింది.

రెండు చర్చాంశాలు ఉంటాయని ప్రకటించినా, మొదటి అంశం మీదనే అంతో ఆసక్తికరంగా, ప్రయోజనాత్మకంగా చర్చ జరగడంతో రెండవ అంశం వచ్చే నెల "వెన్నెల" కార్యక్రమానికి జరుపవలసి వచ్చింది. నేటి కార్యక్రమంలోని ప్రత్యేకత, 20 ఏళ్ళ లోపు వయసు గల తెలుగు పిల్లలు రావడం, ఉత్సాహంగా పాల్గొనడం. అలా వచ్చిన యువ ప్రతినిధులు చంద్రలేఖ కొవ్వలి, గాయత్రి ముళ్ళపూడి, ముకుంద శ్రీరాం చిలుకూరి.

20 మందికి పైగా విచ్చేసిన కార్యక్రమంలో మొదటి చర్చాంశం: "తెలుగు భాషా సంస్కృతులను సంరక్షించడంపై భావితరం దృక్పథం" (Perspectives from Youth on  Preserving and Propagating Telugu Culture and Language).

12 తరగతి చదువుతున్న చంద్రలేఖ కొవ్వలి చర్చకు శ్రీకారం చుడుతూ, అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో పెరుగుతున్న యువతకు తెలుగు భాష నేర్చుకునే అవకాశాలు అతి తక్కువగా వుంటాయని, తాము పెరుగుతున్న వాతావరణం అంతా ఆంగ్ల-మయం అయి వుండడం అందుకు కారణమని అన్నారు. తెలుగు భాష నేర్చుకుని, తెలుగు సంస్కృతిలోని మాధుర్యాన్ని చవిచూడడానికి యువత ఏమి చేయాలి, ఎటువంటి అవకాశాలు అందుబాటులో వున్నాయి, అందుకు పెద్దలు ఎలా సహకరించగలరు, అని సభను ప్రశ్నించారు. సందర్భంగా, తనకు తెలుగు భాష అంటే ఎంతో ప్రీతి వుందని, ఇంటిలో తెలుగులోనే మాట్లాడతానని, చదవడము, రాయడము మాత్రం అంతగా రావని అన్నారు.

ఇటువంటి అంశాన్ని ముందుకు తెచ్చినందుకు చంద్రలేఖను అందరూ అభినందించారు. ముందు తరాలకు తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని తెలియబరిచేందుకూ, ఎన్నో కారణాల వల్ల తెలుగు భాష అంతరించిపోతుందనే విషయం మీదా మునుపు సాహిత్య సభల్లో, సదస్సుల్లో ఎన్ని చర్చలు జరిగినా, అవన్నీ సాహిత్యవేత్తలు, రాజకీయవేత్తలు జరిపారు, పాల్గొన్నారు. ఇప్పుడు మాత్రం "మాకు సాయం చేయండి" అంటూ యువత ముందుకు రావడం విశేషం!   

సభకు వచ్చిన వారిలో అన్ని వయస్సుల వారూ ఎంతో ఉపయోగకరమైన సలహాలిచ్చారు.

హ్యూస్టన్ నగరంలో ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా "తెలుగు బడి" నడుపబడుతున్నదని, అందుకు హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి చేయూతనిస్తున్నదని పలువురు పేర్కొన్నారు. పిల్లలు తమకొచ్చిన తెలుగు భాషను, తెలుగు పద్యాలను ప్రదర్శించడానికి కూడా మన నగరంలో ఏటా పోటీలు నిర్వహించబడుతున్నాయి.
అయితే, ఇన్ని వున్నా పిల్లలు తెలుగు భాషను నేర్చుకోవాలంటే ఇంట తల్లిదండ్రుల ప్రాముఖ్యం ఎంతైనా ఉంది. ఇంట్లో పెద్దలు, పిన్నలు తెలుగులో మాట్లాడకపోతే భాష నేర్చుకోవడానికి పిల్లల్లో ఆసక్తి ఉండదు.   

తెలుగు సంస్కృతి పరంగా ఇక్కడి పిల్లలు శాస్త్రీయ సంగీతం, నాట్యం, సినిమా సంగీతం వంటివి నేర్చుకుంటూనే ఉన్నారనీ, అవి కూడా తెలుగు భాష నేర్చుకోవడనికి బాగా సహకరిస్తాయనీ అన్నారు. తెలుగు సినిమాలు, చక్కటి హాస్య సన్నివేశాలు చూడడం కూడా తెలుగు భాష నేర్చుకోవడానికి, మరింత వర్థిల్లడానికి సాయపడతాయి.

ఇక్కడి యువత తమ మిత్రబృందంతో, బంధువులతో ఎక్కువగా ఆంగ్లంలోనే మాట్లాడుతుంటారు. వారిలో తెలుగువారుంటే జ్ఞాపకం పెట్టుకుని తెలుగులో భాషించే ప్రయత్నం చేయడం ఎంతైనా అవసరం. అటువంటి సందర్భాలలో పిల్లలు తమను తాము శాసించుకోగలగాలి, తేలిగ్గా వుంటుందని తమలో తాము ఆంగ్లంలో మాట్లాడితే తెలుగు నేర్వడం కష్టమైపోతుంది.

తెలుగు భాషపై ఆసక్తి, ప్రెమ వున్న యువతీ యువకులు సంఘటితమై నెలకు ఒకటి రెండుసార్లు కలవడం యువత వేయవలసిన ముందడుగు. ముఖాముఖి కలవడానికి వీలు లేకపోయినా స్కైపు, ఫేస్-టైము వంటి సాంకేతిక పరికరాలాను ఇందుకు సద్వినియోగ పరచుకోవచ్చును. అలా కలసినప్పుడు తమను తాము నియంత్రించుకొని తెలుగు భాషలో మాట్లాడడం, నేర్చుకునే ప్రయత్నం చేయడం ఎంతో అవసరం.
యువ-సమావేశాల్లో తెలుగులో కథా కాలక్షేపాలు, చిన్న నాటకాలు వేయడం వంటివి మంచి ఉపాయాలు.  
సమావేశాలు స్టార్బక్స్ వంటి చోట్ల గానీ, ఎవరి ఇంటిలోనో, గ్రంథాలయాల్లో గానీ పెట్టుకోవచ్చును.
ఎప్పుడైనా సరదాగా తెలుగు సినిమాలు పెట్టుకుని చూడడం కూడా ఒక మంచి ఆలోచన.

ఇవన్నీ చేయడానికి పెద్దల సలహాలు, సహకారమూ, అవసరమైతే ఆరంభ దశలో నిర్దేశము ఉండాలి, ఉంటాయి. క్రమాన్ని ఆరంభిస్తూ ముందస్తుగా ప్రతి నెలా జరిగే "వెన్నెల" కార్యక్రమాల్లో యువతీ యువకులను  ఆకట్టుకునే అంశాలకు కొంత సమయం కేటాయించాలి. అది వచ్చే నెల నుండి అమలు పరచాలని ప్రతిపాదించారు

తెలుగు లిపి కూడా నేర్చుకోవడం ఎంతో అవసరమని సభలో చాలామంది అభిప్రాయపడ్డారు. చిన్నప్పటి నుండి నేర్చుకోకపోయినా కొంత ప్రయత్నము, అభ్యాసము చేసిన మీదట లిపి చదవడం, రాయడం తప్పకుండా వస్తాయి. లిపి వస్తే సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలలోని ఆనందాన్ని చవి చూడగలరు. తమ సృజనాత్మకతను  పదును బెట్టి తెలుగులో కూడా వ్రాయగలరు. తెలుగు లిపి నేర్చుకోవడానికి పెద్దలు ఆలోచించి కొన్ని చక్కటి ప్రణాళికలు వేయాలి. లిపి నేర్పడం కోసం హ్యూస్టన్ తెలుగు బడి ఒక చక్కటి వాతావరణం అందిస్తుంది.

చంద్రలేఖ పూనుకున్న బృహత్కార్యం ఎంతో మెచ్చదగినది, ఆమెకు మనమందరమూ సహకరించి ప్రోత్సహించాలి

అందరూ ఉత్సాహంగా పాల్గొన్న చర్చ పూర్తయిన తరువాత "స్వీయ రచనలు" అంశం జరిగింది.
కొన్ని తెలుగు కవితలు, ఆంగ్లంలో "హైకు" కవితా ప్రక్రియ లో ఒక చక్కటి కవిత వినిపించారు ఉమ పోచంపల్లి.
నాగ్ రొట్టె తండ్రి ప్రేమను, జ్ఞాపకాలను వివరిస్తూ తాను వ్రాసిన ఒక ఉత్కంఠభరితమైన కథను వినిపించారు.
పోతన భాగవతంలోని కొన్ని ప్రఖ్యాతి గాంచిన పద్యాలను బాలమురళి కృష్ణ గోపరాజు వినిపించి, వివరించారు. నేపథ్యంలోనే వంగూరి చిట్టెన్ రాజు అడిగిన ప్రశ్న ఆధారంగా పోతన భాగవతంలోని సంక్షిప్త రామాయణం గురించి సభలో కొంత చర్చ జరిగింది.
తరువాత అమ్మ గురించి తాను వ్రాసిన ఛందోబద్ధమైన పద్యాలను చిలుకూరి సత్యదేవ్ చదివి వినిపించారు.

కార్యక్రమాన్ని ప్రకటించినప్పుడు అనుకున్న "సాహిత్యంలో స్త్రీ పాత్ర" అనే అంశాన్ని వచ్చే నెల "వెన్నెల"లో చర్చిద్దామని అంతా నిర్ణయించారు.
తమ ఆవరణను "వెన్నెల" కార్యక్రమానికి వాడుకోవడానికి అనుమతించిన అష్టలక్ష్మి గుడి నిర్వాహకులకు హార్దిక ధన్యవాదాలు.

పలువురు ప్రేమతో తెచ్చిన రుచికరమైన వంటకాలతో కార్యక్రమం ముగిసింది.

నెల నెలా తెలుగు వెన్నెల - 02/22/2013


నెల నెలా తెలుగు వెన్నెల - 02/22/2013 - శుక్రవారం 

శుక్రవారం, ఫిబ్రవరి 22న "నెల నెలా తెలుగు వెన్నెల" విజయవంతంగా జరిగింది.
"సాహిత్యం సమాజాన్ని మార్చిందా? లేక సాహిత్యం కేవలం సమాజానికి దర్పణమా?" అన్న చర్చాంశంపై సభకు విచ్చేసిన వారందరూ తమ అభిప్రాయాలను వెల్లడి చేసారు. దాదాపు 20 మంది పాల్గొన్న ఈ వెన్నెల కార్యక్రమంలో ఎంతో ఆసక్తికరమైన చర్చ సాగింది.

హ్యూస్టన్వాసులే కాక సాన్ ఆంటోనియో వాస్తవ్యులు దేవగుప్తాపు శేషగిరిరావు, పద్మ దంపతులు కూడా పాల్గొనడం విశేషం. కార్యక్రమాన్ని శేషగిరిరావు తమ అభిప్రాయాలతో ప్రారంభించారు. వాల్మీకి, వ్యాసుడు, పోతన వంటి వారు తమ కావ్యాలతో సమాజంలో దైవభక్తి, ఆధ్యాత్మికత పెరగడానికి  దోహదపడ్డారని ఆయన ఉటంకించారు. వ్యాఖ్యానాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక సంబంధమైన రచనలు, వేదాలు వంటి వాటిని "సాహిత్యం"గా పరిగణించవచ్చా, లేదా అని కొంత చర్చ జరిగింది.

ఆ నేపథ్యంలో దేవగుప్తాపు పద్మ పాశ్చాత్య (ఐరోపా ఖండంలో) సమాజంలో పరివర్తన తేవడానికి కృషి చేసిన కార్ల్ మార్క్స్ ప్రస్తావన తెచ్చి, సమాజాన్ని మార్చడం కోసం వ్రాయబడిన రచనలు అప్పటి సమాజానికి దర్పణం పట్టడమే కాక సామాజిక వ్యవస్థ, ఆలోచనా సరళి కూడా మారడానికి కారణమయినాయని అన్నారు. అయితే, "మైన్ కాంప్ఫ్" వంటి గ్రంథాలను, వ్యాసాలను సాహిత్యం క్రింద పరిగణించవచ్చునా అని కూడా కొంత చర్చ జరిగింది.

తెలుగు నాట సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు తేవడానికి కృషి చేసిన వారిలో అగ్రగణ్యులుగా కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావులను సభలో పేర్కొన్నారు. సంఘాన్ని సంస్కరించడానికి కందుకూరి నడుము కట్టిన వారయితే గురజాడ వారు సాహిత్యం వైపు నుండి తమ ప్రయత్నాన్ని కొనసాగించారని వంగూరి చిట్టెన్ రాజు తెలిపారు.
శ్రీ శ్రీ కూడా తెలుగు సాహిత్యంలో ఒక ప్రభంజనం లేపిన వ్యక్తి అని, ఆయన తరువాత వచ్చిన వారిపై ఆయన శైలి, కవితా వస్తువుల ప్రభావం ఎంతో ఉన్నదని అన్నారు. అయితే, కొందరి సాహిత్యం వల్ల మొత్తం సమాజం మారడం అన్నది జరిగినా జరక్కపోయినా, "సాహిత్య" సమాజాన్ని మాత్రం తప్పకుండా మారుస్తుందని ఆయన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అంటే, ఆయా రచయితలు/కవులు ఇతర రచయితలపై/కవులపై మాత్రం ప్రభావం చూపుతారని, సభ్య సమాజంపై కాకపోవచ్చని సారాంశం.

ప్రతి సమాజంలోనూ రుగ్మతలుంటాయని, వాటిని వెలికి తీసే వ్యక్తులు లేకపోతే రుగ్మతలు నిర్మూలింపబడి సమాజం పురోగమనం చెందబోదని అంటూ, సాహిత్యం సమాజానికి దర్పణం అయి రుగ్మతలను ఎత్తి చూపేందుకు ఒక శక్తివంతమైన సాధనం కాగలదని శాయి రాచకొండ అన్నారు.

రచయిత అయినా రాయాలంటే వారి వెనక "రాజపోషకులు" ఉంటారని, వారి రచనలపై ఆయా పోషకుల ప్రభావం ఉండక తప్పదని, రవి పోడూరి అభిప్రాయ పడ్డారు. కృష్ణదేవరాయల ఆస్థానంలోని కవులు, కవిత్రయము, కార్ల్ మార్క్స్, ఇలా ఎవరైనా కోవకు చెందినవారేనన్నారు. పద్మ పోడూరి ఐరోపాలో ఆంగ్లదేశపు విక్టోరియన్ సాహిత్యాన్ని ఉదహరిస్తూ, సాహిత్యమనేది రచయితల యొక్క దేశ, కాల పరిస్థితులను ప్రతిబింబిస్తుందని, కాలానుగుణంగా మారుతుంటుందని పేర్కొన్నారు.

సాహిత్యం రాసేవారు అందరూ సమాజాన్ని మార్చడమనే ఉద్దేశంతో వ్రాయకపోవచ్చు, కేవలం తమకు అనుభవమైనవీ, సమాజంలో తాము విన్నవి, కన్నవి రాస్తారని, అప్పుడప్పుడు సమాజం సాహిత్యం వల్ల ప్రభావితమవుతుందని సభలో పలువురు అన్నారు.

కొవ్వలి చంద్రలేఖ ఆంగ్ల/అమెరికా సాహిత్యం గురించి చెబుతూ సమాజాన్ని మార్చడానికి ఎంతో మంది సమాజంలోని లోటుపాట్లను వెలికి తెస్తూ "సెటైర్" ప్రాధాన్యమైన రచనలు చేసారని అన్నారు.

సభకు ముగింపు వాక్యాలుగా శేషగిరిరావు మాట్లాడుతూ, సాహిత్యం సమాజాన్ని మార్చడమనేది జరిగినా అది జరగడానికి సామాన్యంగా కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలో, దశాబ్దాలో పడుతుందనీ, మార్పనేది అప్పటికప్పుడు జరిగేది కాదనీ అన్నారు.

సభలో చర్చ పూర్తి అయ్యేటప్పటికి తొమ్మిదిన్నర అవడంతో "స్వీయ రచనలు" భాగం జరపడానికి వీలు కాలేదు. వచ్చే నెల "వెన్నెల" కార్యక్రమంలో సమయాన్ని మరింత జాగ్రత్తగా వివిధాంశాలకు కేటాయించి నియంత్రిస్తే తలపెట్టిన అంశాలన్నిటికీ (స్వీయ రచనలతో సహా) చోటుంటుంది

సభలో ఉత్సాహంగా పాల్గొన్న తక్కిన వారు సుధేష్ పిల్లుట్ల, మధు పెమ్మరాజు, అరుణ కొవ్వలి, గోపాల్ కొవ్వలి, ఉమ గోపరాజు, బాలమురళికృష్ణ గోపరాజు, సీతారాం అయ్యగారి, కాంత్ జోస్యుల, శ్రీదేవి జోస్యుల, లలిత రాచకొండ, చిలుకూరి సత్యదేవ్.
మొత్తానికి, ఎన్నుకున్న చర్చాంశంతో పాటు పాల్గొన్న సభ్యులందరూ సాహిత్యము, సమాజము మధ్యనున్న అవినాభావ సంబంధాన్ని గుర్తించి తమ అభిప్రాయాలను పంచుకోవడానికి "వెన్నెల" అవకాశం తోడ్పడింది

రుచికరమైన భోజనాలతో కార్యక్రమం ముగిసింది.

నెల నెలా తెలుగు వెన్నెల - 01/27/2013


నెల నెలా తెలుగు వెన్నెల - 01/27/2013 - ఆదివారం

సంవత్సరానికి మొదటి "వెన్నెల" కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. పున్నమి తరువాతి పాడ్యమి నాడు సభలో వెన్నెల బాగా కాసింది.
సాయంత్రం  5:30 గం. లకు మొదలు పెడదామనుకున్న కార్యక్రమం కనీస-జనాభా ("quorum") లేకపోవడం వల్ల దాదాపు ఒక గంట ఆలస్యంగా ప్రారంభమయింది. అందువల్ల కార్యక్రమాన్ని కొంత కుదించ వలసి వచ్చింది.
ఏడాది క్రమం తప్పకుండా ప్రతి నెలా వెన్నెల కార్యక్రమాలు జరుపుకోవాలని అందరూ తీర్మానించారు.
ప్రతి నెలలోని మూడవ శుక్రవారం సాయంత్రం 7:30 గం.లకు కలుద్దామని నిర్ణయించారు. ఎక్కడ జరిగేదీ కార్యవర్గం -మెయిలు ద్వారా ప్రకటిస్తుంది.
మన హ్యూస్టన్ వెన్నెలకు బ్లాగు, వెబ్సైటులను పునరుద్ధరించాలనీ, వాటిని ఎప్పటికప్పుడు "update" చెయ్యాలనీ, నిర్ణయించడమయింది. ఇప్పటికే తయారుగా వున్న బ్లాగూ, వెబ్సిటూ వాడవచ్చని అభిప్రాయం వెలిబుచ్చారు.
క్రిందటి నెల 25 పరమపదించిన కీ.శే. పెమ్మరాజు వేణుగోపాల రావుగారి గురించి ఆయనతో దాదాపు ముప్ఫై ఏళ్ళ పరిచయం ఉన్న వంగూరి చిట్టెన్ రాజు గారు, అనిల్ కుమార్ గారూ మాట్లాడారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పెమ్మరాజు గారి నిండైన జీవితం గురించి క్లుప్తంగా వివరించి, తమ ఆంతరంగిక మితృల్లో ఒకరుగా చిట్టెన్ రాజు గారు ఆయనను పేర్కొన్నారు. అణు-భౌతిక శాస్త్రజ్ఞులు, కవి, నాటక రచయిత, కథకులు, చిత్రకారులు, శిల్పకారులు, ఇలా మరెన్నో రంగాలలో నిష్ణాతులైన శ్రీ పెమ్మరాజుగారితో కొద్ది పరిచయం వున్నవారు కూడా సభలో ఆయనకు నివాళులర్పించారు. నేటి సభలో డా. పెమ్మరాజు గారితో పరిచయం లేనివారు మహామనీషి గురించి తెలుసుకో గలిగారు.
నెల రోజుల పైన ఆంధ్రదేశంలో పర్యటించిన డా. చిట్టెన్ రాజు గారు తమ అనుభవాలను పంచుకున్నారు. డిసెంబరులో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల నుండి విజయనగరంలో గురజాడ గారి ఇంటిని సందర్శించిన విశేషాలూ, తమకు దక్కిన "లోక్ నాయక్" పురస్కార సభ వివరాలూ, తమ నూట పదహారు కథల సంకలనం ఆవిష్కరించడమూ, దేశ రాజధాని ఢిల్లీలోని సాహిత్య అకాడెమీలో తమ అనుభవాలూ పంచుకున్నారు.
కార్యక్రమం ఆలస్యంగా ఆరింభించడం వలన స్వీయ రచనలకు వ్యవధి లేకపోయింది. వచ్చే నెల వెన్నెలకు అందరూ అనుకున్న సమయానికి హాజరయితే తలపెట్టిన అంశాలన్నీ సక్రమంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని మనవి.