జరుగుతున్నదీ జగన్నాటకం … 44వ "వెన్నెల" కార్యక్రమంలో "సిరివెన్నెల" రచనకు వివరణ

చిత్రం: కృష్ణం వందే జగద్గురుం; రచన: "సిరివెన్నెల" సీతారామ శాస్త్రి

వివరణ: చిలుకూరి సత్యదేవ్ (మూలం: జీడిగుంట విజయసారధి)

జరుగుతున్నదీ జగన్నాటకం ...జరుగుతున్నదీ జగన్నాటకం ...
పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కధనం
నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్ధం 
జరుగుతున్నది జగన్నాటకం ...జరుగుతున్నది జగన్నాటకం ...
భాగవత లీలలన్నిటిలోనూ, భగవంతుని అవతారాలన్నిటిలోనూ మన నిత్య జీవితానికి పనికొచ్చే సత్యాలుంటాయని చెప్పే గీతం. అందులో మానవాళిని ప్రోత్సహిస్తూ అవతారాల్లోని అంతరార్థాన్ని వెలికి తీయడానికి ప్రయత్నించిన కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

చెలియలి కట్టను తెంచుకుని …విలయము విజృంభించునని 
ధర్మ మూలమే మరచిన జగతిని …యుగాంతమెదురై ముంచునని
సత్యవ్రతునకు సాక్షాత్కరించి …సృష్టి రక్షణకు చేయూతనిచ్చి
నావగ తోవను చూపిన మత్స్యం …కాల గతిని సవరించిన సాక్ష్యం 
ధర్మం నాశనమై ప్రళయం వచ్చినప్పుడు మత్స్యావతారంలో లోకానికి ఒక క్రొత్త ఆరంభాన్ని అందించిన అవతారం. అవసరమైతే ఒక చిన్న చేప కూడా కాలగతిని మార్చగలదు - ప్రళయము, సునామీలు వచ్చినా ఎప్పుడూ నేను చిన్నవాణ్ణని వెనుకంజ వేయకూడదు, ధైర్యంగా ముందుకెళ్ళాలి.
చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే 
పొందగోరిన దందలేని నిరాశతో అణగారి పోతే 
బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక
ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది 
క్షీర సాగర మధన మర్మం
గొప్ప పనులు తలపెట్టినప్పుడు ఎన్నో కష్టాలొస్తాయి, చావు వచ్చేంతటి పరిస్థితి రావచ్చు, మోయలేని బరువులను మోయవలసి రావచ్చు. అయినా మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి, సముద్ర మథనం సాగినట్లుగా, చివరకు కోరిన ఫలితాలొస్తాయి. నిరాశలో మునిగిపోతున్న మానవులకు ఓర్పుతో ముందుకు సాగిపోవాలనే స్ఫూర్తినిచ్చే అవతారమే కూర్మావతరం"బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పులు" - సముద్ర మథన సమయంలో సర్పరాజు వాసుకి నోట వచ్చిన హాలాహలం.

ఉనికిని నిలిపే ఇలను కడలి లో కలుపగనురికే ఉన్మాదమ్మును...
కరాళ దంష్ట్రుల కుళ్ళగించి ఈ ధరాతలమ్మును ఉధ్ధరించగల...
ధీరోధ్ధతి రణ హుంకారం... ఆదివరాహపు ఆకారం...
మన మనుగడనే ముంచి వేసే దుష్టులను అంతమొందిచడానికి కావలసిన ధైర్యాన్ని మనకు కలిగిస్తూ భీభత్స రసాన్ని చూపించే అవతార వర్ణన ఇది - వరాహావతారం.

ఏడీ ఎక్కడరా.. నీ హరి దాక్కున్నాడేరా భయపడి ...
బయటకి రమ్మనరా ఎదుటపడి... నన్ను గెలవగలడ తలపడి...

నువు నిలిఛిన ఈ నేలను అడుగు... నీ నాడుల జీవజలమ్మును అడుగు...
నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు... నీ ఊపిరిలో గాలిని అడుగు...
నీ అణువుల ఆకాశాన్నడుగు.. నీలో నరునీ హరినీ కలుపు..
నీవే నరహరివని నువు తెలుపు....

"ఇందుగలడందు లేడని సందేహము వలదు" పద్యాన్ని జ్ఞప్తికి తెచ్చే చరణం ఇది. నేల, (జీవ)జలం, (రక్తపు వెచ్చదనం) అగ్ని, (ఊపిరిలో) గాలి, (అణువణువుకూ మధ్యనున్న) ఆకాశం - ఇలా పంచభూతాల లోనూ ఉన్నాడు హరి; పంచభూతాలెక్కడో లేవు, నీలోనే వున్నాయి - అంటే హరి నీలోనే వున్నాడు అంటూ "మానవుడే మాధవుడు" అనే తత్వాన్ని నరసింహావతారం ఉపోద్ఘాతంలో వెలికి తీసారు కవి.
ఉన్మత్త మాతంగ  భంగి ఘాతుక వితతి
హంతృ  సంఘాత  నిర్ఘృణ  నిబడమే  జగతి
అఘము  నగమై  ఎదిగే  అవనికిదె  అశనిహతి
ఆతతాయుల  నిహతి  అనివార్యమౌ  నియతి  ..
శితమస్తి  హత  మస్తకారి  నఖ  సమకాశియో  ..
క్రూరాసి గ్రోసి  హుతదాయ దంష్ట్రుల  ద్రోసి  మసిజేయు  మహిత  యజ్ఞం
సందర్భోచితంగా ఎంతో భీకరమైన దృశ్యాన్ని చిత్రిస్తూ అందుకు తగ్గట్టుగానే చాల గట్టి పదజాలాన్ని వాడుతూ నరసింహుడు రాక్షసుణ్ణి చంపే సందర్భాన్ని వర్ణించారు సిరివెన్నెల.

“హంతకులు, సంఘవిద్రోహక శక్తులు, కఠినాత్ముల పాపపు సమూహాలు మదమెక్కిన ఏనుగుల్లాగా పెరిగి భూమికి కొండంత భారమై గర్భస్థ శిశువుల్ని సైతం చంపె పరిస్తితి ఎదిగితే ఒక పిడుగుపాటు లా వచ్చి వారిని తప్పనిసరిగా సంహరించదమె అసలు సిసలైన నీతి. ఏనుగుల సమూహాన్ని చెల్లా చెదురు చేసి చంప గలిగే సింహం తన గోళ్ళ తొ ఆ కుంభస్థలాన్ని చీల్చి చెండాడి ముక్కలు ముక్కలు గా నరికి అగ్ని దేవుడి మంటల్లొ ఆహుతి చేసే మహా యజ్ఞమే ఈ నరసింహావతారం”

ఉన్మత్త (మదించిన ) మాతంగ (ఏనుగు) భంగి ( విధంగా) ఘాతుక వితతి (పాప సమూహము)
హంతృ (హంతకులు) సంఘాత (సంఘ విద్రోహులు) నిర్ఘృణ (దయలేని వారు, కఠినులు) నిబడమే (నిండి ఉన్న) జగతి 
అఘము (పాపము) నగమై (కొండంతై) ఎదిగే (పెరిగే) అవనికిదె (భూమికిదే) అశనిహతి (పిడుగుపాటు)

ఆతతాయుల ( గర్భస్థ శిశువును సైతం సంహరించేంత దుర్మార్గులు) నిహతి (నిర్జించడం ) అనివార్యమౌ (తప్పనిసరి) నియతి (నీతి) ..
శితమస్తి (ఏనుగుల సమూహం) హత ( చంప గలిగే) మస్తకారి (కుంభస్థలానికి శతృవు లేదా సింహం) నఖ (గోళ్ళు) సమకాశియో (సమానమైనది) ..
క్రూరాసి (ఖడ్ఘం) గ్రోసి (ఖండించడం) హుతదాయ ( అగ్ని దేవుడి) దంష్ట్రుల (మంటలు) ద్రోసి (త్రోసి) మసిజేయు ( కాల్చి మసి చేయడం) మహిత ( మహనీయమైన) యజ్ఞం (యజ్ఞం)

అమేయమనూహ్యమనంత విశ్వం..
ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం.. ఈ మానుష రూపం...
కుబ్జాక్రుతిగా.. బుధ్ధిని భ్రమింపజేసే... అల్ప ప్రమాణం...
ముజ్జగాలను మూడడుగులతొ కొలిచే త్రైవిక్రమ విస్తరణం...
జరుగుతున్నది జగన్నాటకం.... జరుగుతున్నది జగన్నాటకం....

అనంత విశ్వంలో అతి చిన్న రేణుసమానుడైన మానవుడు తన మేధస్సును వాడి మూడడుగులు వేసినంత సులువుగా ముల్లోకాలనూ జయించగలడని సిరివెన్నెల గారు వామనావతారాన్ని విశ్లేషించారు.
పాపపు తరువై.. పుడమికి బరువై... పెరిగిన ధర్మగ్లానిని పెరుకగ..
పరశురాముడై.. భయదభీముడై.. ధర్మాగ్రహ విగ్రహుడై నిలఛిన...
శోత్రియ క్షత్రియ తత్వమె భార్గవుడు...
 
పాపాలు బాగా విస్తరించిపోయినప్పుడు వాటిని కూకటివేళ్ళతో సహా పెళ్ళగించడానికి సత్వగుణంతో పాటు రజోగుణం కూడా కావాలని, ధర్మాన్ని నిలపడం కోసం బ్రాహ్మణుడిగ పుట్టినా క్షాత్రాన్ని, ఆగ్రహాన్ని వాడిన పరశురామావతారానికి వివరణ ఇది.

మహిమలూ లేక మాయలూ లేక
నమ్మశక్యము గాని మర్మమూ లేక 
మనిషి గానే పుట్టి మనిషి గానే బ్రతికి 
మహిత చరితగ మహిని మిగలగలిగే మనికి (మని  = lifestyle)
సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచె 
రామావతారాన్ని అతి సులువైన మాటలతో, రాముడు ఎంత సామాన్య మానవుడిలా బ్రతికాడో చెప్పడమైనది. అటువంటి జీవనవిధానంతో కూడా కలకాలం నిలిచిపోగలడు మానవుడని ఋజువు చేసారు.
ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా.. నిన్ను నీకే నూత్న పరిచితునిగా
దర్శింప జేయగల జ్ఞానదర్పణము... కృష్ణావతారమే.. సృష్ట్యావరణ తరణము....


అనిమగా, మహిమగా, గరిమగా, లఘిమగా, ప్రాప్తిగా, ప్రాకామ్యవర్తిఘా, ఈశత్వముగా, వశిత్వమ్ముగా
నీలోని అష్టసిధ్ధులూ నీకు కనపట్టగా... సస్వరూపమే.. విశ్వరూపమ్ముగా.
నరుని
లోపలి పరుని పై దృష్టి పరుపగా 
తల వంచి కైమోడ్చి సిష్యుడవు నీవైతే 
నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే 
ప్రతి మనిషీ వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు విధాలుగా భాసిస్తాడు. జ్ఞానంతో ఆ కోణాలన్నీ మనలో మనమే తెలుసుకోవచ్చును.
అష్టసిద్ధులూ మనలోనే వున్నాయి, వాటిని వాడుకుని మనమే విశ్వరూపం చూపించవచ్చు. ఈ విషయాన్ని తెలియజేసే అవతారమే జగద్గురువైన కృష్ణావతారం.
నీలోని గురువుకు నీవే తల వంచి శిష్యుడవైతే నీలోని అజ్ఞానాన్ని నీవే పోగొట్టుకునే అవకాశం వుంటుంది.
అద్వైత సిద్ధాంతాన్ని ఈ విధంగా చూపుతూ పాటను పూర్తి చేసారు సిరివెన్నెల.

వందే కృష్ణం జగద్గురుం ... వందే కృష్ణం జగద్గురుం ...
కృష్ణం వందే జగద్గురుం ...కృష్ణం వందే జగద్గురుం ...
వందే కృష్ణం జగద్గురుం ...వందే కృష్ణం జగద్గురుం ...
కృష్ణం వందే జగద్గురుం ...కృష్ణం వందే జగద్గురుం ...
కృష్ణం వందే జగద్గురుం !

****************************************

{మిత్రులు జీడిగుంట విజయసారథిగారు idlebrain.com లో ఆంగ్లంలో వ్రాసిన విశ్లేషణ ఆధారంగా - ఆయనకు ధన్యవాదాలతో...}